![]() |
![]() |

ఉన్నత స్థాయి సినిమాటోగ్రఫీతో పలు చిత్రాలకు మెయిన్ ఎస్సెట్ అనిపించుకున్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ కరోనాతో పోరాటం చేస్తూ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన స్వస్థలం వరంగల్. ఇటీవల కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
తెలుగులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఆయన పనిచేశారు. దివంగత మహానటుడు ఎన్టీఆర్ చివరి చిత్రం 'మేజర్ చంద్రకాంత్'కు సినిమాటోగ్రాఫర్ ఆయనే. ఎన్టీఆర్‌ను చూడాలనే కోరికతో రైలెక్కి మద్రాస్ వెళ్లిన జయరామ్ ఆయన హీరోగా నటించిన 'డ్రైవర్ రాముడు', 'సింహబలుడు', 'వేటగాడు' లాంటి సినిమాలకు పనిచేయడం చిన్నవిషయం కాదు. కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన పలు చిత్రాలకు జయరామ్ వర్క్ చేశారు. మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'పెళ్లి సందడి' అంత అందంగా మన ముందుకు వచ్చిందంటే, అది జయరామ్ కెమెరా పనితనం వల్లే.
సినిమాల మీద పిచ్చితో వరంగల్ నుంచి మద్రాస్‌కు చిన్నతనంలోనే వెళ్లిన జయరామ్ అక్కడి ఆంధ్రా క్లబ్‌లో చిన్న ఉద్యోగంలో చేరి, అక్కడే క్యాషియర్ స్థాయికి ఎదిగారు. ప్రఖ్యాత దర్శకుడు ఎల్వీ ప్రసాద్ కుమారుడు ఆనంద్ బాబు ప్రోత్సాహంతో కెమెరా అసిస్టెంట్‌గా, ఆ తర్వాత ఆపరేటివ్ కెమెరామన్‌గా, ఆపైన సినిమాటోగ్రాఫర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు జయరామ్.
సినిమాటోగ్రాఫర్‌గా జయరామ్ ఫస్ట్ ఫిల్మ్‌లో హీరో చిరంజీవి కావడం విశేషం. ఆ సినిమా పేరు కూడా 'చిరంజీవి'. సి.వి. రాజేంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని కైకాల సత్యనారాయణ నిర్మాత. ఆ సినిమాకు జయరామ్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకోవాలన్న ఆలోచన సత్యనారాయణ తమ్ముడు కైకాల నాగేశ్వరరావుది.
ఆ తర్వాత 'శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం' చిత్రం సినిమాటోగ్రాఫర్‌గా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. కె. వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఏడు రోజుల్లో పూర్తి చేశారు. మమ్ముట్టి హీరోగా ఐవీ శశి డైరెక్ట్ చేసిన మలయాళం చిత్రం '192'1తో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్నారు జయరామ్.
సౌందర్య నటించిన చివరి చిత్రం, మోహన్‌బాబు సొంత చిత్రం 'శివశంకర్'కు ఆయన పనిచేశారు. ఈ సినిమాలో సౌందర్య చనిపోయే సన్నివేశాలను ఆయన చిత్రీకరించారు. ఆ తర్వాత రెండ్రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తనను ఎంతగానో కలచివేసిందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకున్నారు. మోహన్‌బాబు ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌గా జయరామ్ పేరు తెచ్చుకున్నారు. జయరామ్ మృతికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.
![]() |
![]() |