![]() |
![]() |

నటి గౌతమి దక్షిణాదిలోని నాలుగు భాషా చిత్రాలతో పాటు, హిందీలోనూ కొన్ని సినిమాలు చేశారు. ప్రధానంగా తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిమాన నటి ఆమె. విజయచందర్ సినిమా 'దయామయుడు' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ వైజాగ్ అమ్మాయికి మూడో సినిమా 'శ్రీనివాస కల్యాణం' నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 'జెంటిల్‌మన్' సినిమాలో ప్రభుదేవాతో ఆమె డాన్స్ చేసిన "చికుబుకు చికుబుకు రైలే" పాట ఇప్పటికీ మన కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది.
చిన్నతనంలో తానెప్పుడూ కలలో కూడా సినీ తారనవుతానని గౌతమి అనుకోలేదు. ఆమెకు సినిమాలు చూడాలనే ఆసక్తి కూడా అంతగా ఉండేది కాదు. "కాలేజీలో చదువుకొనే రోజుల్లో కూడా ఏదో ఒకటీ అరా తప్ప ఎక్కువ సినిమాలు చూసేదాన్ని కాదు." అని ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. అయితే నాలుగైదేళ్ల వయసులోనే ఆమె ఓ సినిమా షూటింగ్ చూశారు. ఆ సినిమా పేరు 'నీడలేని ఆడది'. అందులో ప్రభ హీరోయిన్.
"ఆ సినిమా షూటింగ్ వైజాగ్‌లో మా ఇంట్లోనే జరిగింది. అదే నేను చూసిన మొదటి సినిమా షూటింగ్. అంతా సందడిగా తిరుగుతుండటం.. లైట్లు.. కెమెరా.. ఏదో గందరగోళంగా ఉండేది. చిన్నతనం కదా.. నాకూ చాలా సరదాగా అనిపించింది. ఆ చిత్రానికి ఎస్.ఎస్. లాల్‌గారు కెమెరామన్. అప్పుడే నేను మా నాన్నగారితో, లాల్ గారితో ఓ ఫొటో కూడా తీయించుకున్నా. అంటే నాకు ఊహ తెలిసీ తెలియని వయసులోనే సినిమా ప్రపంచంతో పరిచయం జరిగిందన్నమాట. ఇదే కాదు.. నాగేశ్వరరావు గారు, కృష్ణకుమారి గారు నటించిన 'కులగోత్రాలు' షూటింగ్ కూడా మా ఇంట్లో జరిగింది." అని చెప్పుకొచ్చారు గౌతమి.
![]() |
![]() |