![]() |
![]() |

ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు విశ్వేశ్వర రావు ఈరోజు ఉదయం చెన్నైలో కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు మంజు, శాంతి. కుమారుడు ధనుంజయ్. నిర్మాత, దర్శకునిగా విశ్వేశ్వరరావు తెలుగు సినిమాకు ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించారు. ఆయన మహానటుడు, నాయకుడు దివంగత ఎన్టీ రామారావుకు స్వయానా బావమరిది. అంతే కాదు, తన కుమార్తె శాంతిని ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అలా రామారావుకు వియ్యంకుడు అయ్యారు. అలాగే నటుడు, నిర్మాత మాగంటి మురళి మోహన్ కుమారుడు రామ్మోహన్‌కు విశ్వేశ్వరరావు మనవరాలు అంటే మంజు కుమార్తె రూపను ఇచ్చి వివాహం చేశారు.
ఎన్టీఆర్‌తో విశ్వేశ్వరరావు కంచుకోట (1967), నిలువు దోపిడి (1968), పెత్తందార్లు (1970), దేశోద్ధారకులు (1973) చిత్రాలు నిర్మించారు. దర్శకుడుగా తీర్పు (1975), నగ్నసత్యం (1979), హరిశ్చంద్రుడు (1981), కీర్తి కాంత కనకం (1983) చిత్రాలు ఆయనకు అవార్డులతో పాటు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాలను అప్పటి సామాజిక సమస్యలపై తీశారు.
1986లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా విశ్వేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా డి.వి.ఎస్. రాజు వున్నారు. ఆ చిత్రోత్సవం అంత ఘనవిజయం కావడంలో రామారావుకు చేదోడు వాదోడుగా వున్నది ఆ ఇద్దరే. ఇప్పటికీ దేశంలో ఇలాంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరగలేదు. 17వ నేషనల్ అవార్డ్స్ కమిటీ జ్యూరీ మెంబర్ గా కూడా ఆయన పనిచేశారు.
![]() |
![]() |