![]() |
![]() |

2002లో వచ్చిన ఓ సినిమాతో ఓ యువ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోటే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఆ డైరెక్టర్.. వి.వి. వినాయక్. ఆ సినిమా.. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ చేసిన 'ఆది'. ఆ మూవీతోటే తారక్ కెరీర్ టర్న్ తీసుకుంది. అతను మాస్ స్టార్‌గా విపరీతమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అప్పుడు తారక్ వయసు 18 సంవత్సరాలే. ఇటు వినాయక్‌కూ, అటు తారక్‌కు.. ఇద్దరికీ 'ఆది' మరపురాని చిత్రంగా నిలిచింది.
తనకు ఊహకు మించి 'ఆది'గా తారక్ సూపర్బ్ పర్ఫార్మెన్స్ను ఇచ్చాడని చెప్పే వినాయక్ ఆ సినిమా ఇచ్చిన అనుభవాలను పంచుకున్నారు.
"తారక్ ఈ కథ ఓకే చెయ్యగానే మా నాన్నకి ఫోన్ చేశా. ఓ స్నేహితుడిలా ఆయనతో అన్నీ చర్చించేవాణ్ణి. 'ఆది' రిలీజయ్యాక నాకు హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ వస్తుందని గట్టి నమ్మకంతో చెప్పా. నా ఆత్మవిశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నిజంగానే సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు గారు అప్పట్లో అందరికంటే అత్యధిక పారితోషికం ఆఫర్ చేశారు. 'ఆది' అంటే నా ఒక్కడికే కాదు, దానికి సంబంధించిన వాళ్లందరికీ ప్రత్యేక ప్రేమ.
నా జీవితంలో మరపురాని, మరవలేని సినిమా. ఎన్ని సినిమాలు తీసినా 'ఆది' ఆదే. ఆ సినిమా చేసిన ఆత్మవిశ్వాసం, అప్పటి పొగరు, ఆ ధైర్యం ఆ తర్వాత నాకు లేకుండా పోయాయి. అది అంత హిట్టవడమే కారణం. ఈ చిత్రంలో యాక్టర్లు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, నేను కోరుకున్నవాళ్లే వచ్చారు. నిర్మాతలు ఆ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు తెలిసి కొత్త దర్శకుల్లో అంటే తొలి సినిమాకే పూర్తి స్వేచ్ఛతో, ఏదంటే అది చేయగలిగింది నేనొక్కణ్ణే.
.jpg)
'అన్నయ్యా' అని పిలుస్తూ తన కుటుంబంలో మనిషిగా నాకు గౌరవాన్నిచ్చాడు తారక్. అంత శక్తిమంతమైన పాత్రని అంత చిన్న వయసులో మెప్పించడం మామూలు సంగతి కాదు. యువ హీరోల్లో ఎవరికీ లేనటువంటి డైలాగ్ డిక్షన్ తారక్ సొంతం. ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలో మరీ. డాన్సుల్లోనూ, ఎనర్జీ లెవల్స్‌లోనూ అతనిది పైస్థాయి. పైగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముణ్ణి జనం ఆ అబ్బాయిలో చూడటం కూడా సినిమా విజయానికి కారణం.
'ఆది' పాత్రని నా ఊహకి మించి గొప్పగా చేశాడు. అతను ఆల్‌రౌండర్. 'బార్న్ ఆర్టిస్ట్'. యాక్షన్ సీన్లలో, డాన్సుల్లో పక్కవాళ్ల కో-ఆర్డినేషన్ కుదరక రెండు మూడు టేకులు ఎప్పుడన్నా తీసుకున్నాడేమో గానీ, తనకు సంబంధించిన సన్నివేశాల్లో రెండో టేక్ తీసిన సందర్భమేదీ నాకు జ్ఞాపకం లేదు. ఇది రాయలసీమ కథ అయినప్పటికీ క్లైమాక్స్ సన్నివేశాల్ని విజయనగరంలోని సైనిక్ స్కూల్లో చేశాం. క్లైమాక్స్ తీసేప్పుడు తారక్ చేతికి గ్లాస్ తగిలి గాయమైంది. 'ఆది' హిట్టయ్యాక ఏ సినిమాలో తారక్‌కు దెబ్బ తగిలితే ఆ సినిమా హిట్టవుద్దనే సెంటిమెంట్ ఏర్పడింది.
ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోవాల్సిన మరో అంశం మణిశర్మ సంగీతం. ఆయన సినీ జీవితంలోని గొప్ప పాటల్లో 'నీ నవ్వుల తెల్లదనాన్ని' పాట తప్పకుండా ఉంటుంది. ఈ పాట రాసింది చంద్రబోస్. 'ఆది' తీయడానికి రెండేళ్ల ముందే ఈ పాటని నాకు వినిపించాడు. దాన్ని ఎవరికీ ఇవ్వొద్దనీ, నా సినిమాలో అది ఉండాలనీ అడిగా. సరేనని, మాట మీద నిలబడ్డాడు."
![]() |
![]() |