![]() |
![]() |

సినిమా పేరు: సర్దార్ కా గ్రాండ్‌సన్
తారాగణం: అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్, నీనా గుప్తా, జాన్ అబ్రహాం, అదితిరావ్ హైదరి, కన్వల్జిత్ సింగ్, సోనీ రజ్దాన్, కుముద్ మిశ్రా, దివ్యా సేఠ్, మసూద్ అఖ్తర్, మహీకా పటియాల్, ప్రియా టాండన్, షాహిద్ లతీఫ్
కథ: కాష్వీ నాయర్
స్క్రీన్‌ప్లే: అనూజా చౌహాన్, కాష్వీ నాయర్
డైలాగ్స్: అమితోష్ నాగ్‌పాల్
మ్యూజిక్: తనిష్క్ బాగ్చి, గుల్‌రాజ్ సింగ్
సినిమాటోగ్రఫీ: మహేంద్ర శెట్టి
ఎడిటింగ్: మాహిర్ జవేరి
డైరెక్టర్: కాష్వీ నాయర్
విడుదల తేదీ: 2021 మే 18
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
గత ఏడాది మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడిన దగ్గర్నుంచీ కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతూ వస్తున్నాయి. ఆమధ్య సూర్య సినిమా 'ఆకాశమే నీ హద్దురా' (ఒరిజినల్ 'సూరారై పొట్రు'), ఇటీవల సల్మాన్ ఖాన్ మూవీ 'రాధే' నేరుగా ఓటీటీలో విడుదలై భారీ సినిమాలకు కూడా ఓటీటీ బాగానే వర్కవుట్ అవుతుందనే విషయాన్ని నిరూపించాయి. ఇప్పుడు 'సర్దార్ కా గ్రాండ్‌సన్' అనే హిందీ సినిమా కూడా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలయింది. ఇందులో మన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.
కథ
'సర్దార్ కా గ్రాండ్‌సన్' అనేది అనారోగ్యంతో మంచంపట్టిన నాయనమ్మ చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించే మనవడి కథ. ఆ మనవడి పేరు అమ్రీక్ (అర్జున్ కపూర్). అతగాడు తన గాళ్‌ఫ్రెండ్ రాధ (రకుల్‌ప్రీత్ సింగ్)తో కలిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ జెంట్లీ జెంట్లీ అనే ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీని నడుపుతుంటాడు. అమ్రీక్‌ది దేన్నీ సీరియస్‌గా తీసుకోని జోవియల్ టైప్ మనస్తత్వం. ఇది అతని పని మీదనే కాదు, రాధతో బంధం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అతని బిహేవియర్‌తో విసిగిపోయిన రాధ అతడికి బ్రేకప్ చెప్పేస్తుంది. దీంతో అమ్రీక్ షాకవుతాడు.
అదే సమయంలో ఇండియాలోని అమృత్‌సర్ నుంచి తండ్రి గురుకీరత్ (కన్వల్జిత్ సింగ్) అతడిని వెంటనే ఇంటికి వచ్చేయమంటాడు. నాయనమ్మ సర్దార్ (నీనా గుప్తా) జబ్బుపడిందని చెప్తాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్లి, అక్కడ తన భర్త గుర్‌షేర్ సింగ్ (జాన్ అబ్రహాం)తో 1946లో కలిసి కట్టుకున్న ఇంటిని చూడాలనేది ఆమె సర్దార్ ఆఖరి కోరిక. దేశ విభజన సమయంలో అల్లరిమూకలతో జరిగిన గొడవలో గుర్‌షేర్ చనిపోతాడు. సర్దార్ ఎలాగో తప్పించుకొని ఇండియాకు వస్తుంది. అప్పట్నుంచీ, గుర్‌షేర్‌తో పాటు ఆ ఇంటినీ మిస్సవుతున్న ఫీలింగ్ సర్దార్‌ది. నాయనమ్మ కోరికను అమ్రీక్ తీర్చాడా? అతని ప్రయాణంలో ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయనేది మిగతా కథ.
.jpg)
విశ్లేషణ
అనూజా చౌహాన్, కాష్వీ నాయర్ సమకూర్చిన కథ వినడానికి చాలా బాగుంది. వారి స్క్రీన్‌ప్లే కూడా నీట్‌గానే అనిపించింది. అయితే స్క్రీన్‌ప్లేలో గ్రిప్పింగ్‌ను చివరి దాకా కొనసాగించడంలో వారు విఫలమయ్యారు. భావోద్వేగ సన్నివేశాల్ని బాగా మలిచారు. భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహ సుహృద్భావం ఉండాలనే సందేశం కూడా ఆకట్టుకుంటుంది. సన్నివేశాలకు తగ్గట్లు అమితోష్ నాగ్‌పాల్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అయితే చిన్నప్పుడు తనకు తగిలిన గాయాల గురించి అవసరం లేకపోయినా పదే పదే అమ్రీక్ ప్రస్తావించడం చికాకు వ్యవహారం.
ఒక క్లిష్టమైన కథను ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మలచడం అంత సులువైన విషయం కాదు. ఈ విషయంలో కాష్వీ నాయర్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. భావోద్వేగ, నాటకీయ సన్నివేశాల్లో ఆమె చూపించిన పరిణతి ముచ్చటేస్తుంది. ఈ సినిమాకు బలమంతా సర్దార్ క్యారెక్టరే. ఆమె ఫ్లాష్‌బ్యాక్ స్టోరీతో, తను కట్టుకున్న ఇంటిని చూడాలనుకొనే ఆమె సెంటిమెంట్‌తో మనం ఈజీగా కనెక్టయిపోతాం. అయితే కొన్ని సీన్లు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. ఉదాహరణకు పాకిస్తాన్‌లో ఉన్న సర్దార్ ఇంటిని 70 సంవత్సరాల పాటు ఎవరూ తాకకుండా ఉండటం, అన్నేళ్లయినా అది శిథిలావస్థకు రాకపోవడం ఏ విధంగానూ లాజిక్‌కు అందదు. సెకండాఫ్‌ను కనీసం ఓ పావుగంట అయినా ట్రిమ్ చేసి ఉన్నట్లయితే కథనంలో ఇంకా ఆసక్తి పెరిగేది. అమ్రీక్ లాహోర్‌కు వెళ్లాక ఎదుర్కొనే ఘటనలు భావోద్వేగాన్ని రేకెత్తిస్తాయి.
పాటలకు తనిష్క్ బాగ్చి ఇచ్చిన మ్యూజిక్ సోసోగా ఉంది. పాటలు ఏవైనా ఆడియెన్స్‌కు గుర్తుంటాయనేది డౌటే. గుల్‌రాజ్ సింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని మూడ్‌ను ఎలివేట్ చేసింది. డైరెక్టర్ మనసును అర్థం చేసుకున్నట్లు మహేంద్ర జె. శెట్టి ఇంప్రెసివ్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఎడిటర్ మాహిర్ జవేరి తన కత్తెరకు మరింత పని పెట్టివుంటే బాగుండేది. నీనా గుప్తాను 90 ఏళ్ల వృద్ధురాలిగా చూపించడంలో మేకప్ అంత రియలిస్టిగ్గా అనిపించలేదు. వీఎఫ్ఎక్స్ వర్క్‌లో క్వాలిటీ కనిపించింది.

నటీనటుల అభినయం
అమ్రీక్ పాత్రలో అర్జున్ కపూర్ మంచి నటనే ప్రదర్శించాడు. ఇటీవలి కాలంలో ఇది అతని బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాహోర్ సీన్లలో అతను మనకు నచ్చుతాడు. రాధగా కనిపించినంత సేపూ రకుల్‌ప్రీత్ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లో ఆమెకు కథలో ఎక్కువ స్కోప్ లభించలేదు. సెకండాఫ్‌లో తన నటనతో మెప్పించింది. కథకు కేంద్రం లాంటి పాత్ర చేసిన నీనా గుప్తా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె పాత్ర ప్రేక్షకుల మనసులపై ముద్ర వేస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్లలో సర్దార్ యంగ్ ఏజ్‌లో ఉండగా ఆ పాత్రను పోషించిన అదితి రావ్ హైదరి, జాన్ అబ్రహాంలతో మనం ప్రేమలో పడిపోతాం. అర్జున్ కపూర్ ఫాదర్‌గా కన్వల్జిత్ సింగ్ మరోసారి ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్‌గా కుముద్ మిశ్రా సరిగ్గా సరిపోయాడు. మిగతా వాళ్లు పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
ఓవరాల్‌గా చూస్తే, 'సర్దార్ కా గ్రాండ్‌సన్' ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్. కొన్ని విసుగుతెప్పించే సన్నివేశాలు ఉన్నప్పటికీ భావోద్వేగభరిత సన్నివేశాలు, హృదయాన్ని స్పృశించే క్లైమాక్స్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ఆకట్టుకుంటుందని చెప్పాలి.
రేటింగ్: 2.75/5
- బుద్ధి యజ్ఞమూర్తి
![]() |
![]() |