![]() |
![]() |

తండ్రి వేసిన గెటప్‌ను వేసే అవకాశం ఎంతమందికి వస్తుంది? హీరోలంటే ఓకే. వారసులుగా తండ్రి లేదా తాత గెటప్పులను వేస్తుండటం మనం చూస్తుంటాం. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అలాంటి అవకాశం రావడం సాధారణంగా జరగదు. అయితే రావు రమేశ్‌కు ఆ అవకాశం వచ్చింది. ఆయన తండ్రి రావు గోపాలరావుకు ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మనకు తెలుసు. 'ముత్యాల ముగ్గు'లో చేసిన కాంట్రాక్టర్ పాత్రతో తెలుగు విలనిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన నటునిగా చరిత్రలో ఆయన నిలిచిపోయారు. ఆ సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ ఐకానిక్‌గా నిలిచింది.
విలన్ రోల్స్ చేసినా, సాఫ్ట్ రోల్స్ చేసినా రావు గోపాలరావు తనదైన ముద్రను ప్రేక్షకుల హృదయాలపై వేశారు. నిజం చెప్పాలంటే ఆయనను ప్రేక్షకులు తమవాడిగా చేసుకున్నారు. అలాంటి తండ్రికి వారసుడిగా ఇండస్ట్రీలో ప్రవేశించి, తండ్రి పేరును నిలబెడుతున్న నటుడిగా రాణిస్తున్నారు రావు రమేశ్. నెగిటివ్ రోల్స్‌లోనూ, సాఫ్ట్ రోల్స్‌లోనూ గొప్పగా నటిస్తున్నాడనే ప్రశంసలు పొందుతున్నారు.
నాలుగేళ్ల క్రితం అల్లు అర్జున్ సినిమా 'దువ్వాడ జగన్నాథమ్'లో విలన్‌గా నటించారు రావు రమేశ్. అందులో ఆయన పాత్రపేరు రొయ్యల నాయుడు. విశేషమేమంటే ఇ.వి.వి. సత్యనారాయణ సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు' (1992)లో రావు గోపాలరావు హీరోయిన్ రంభ తండ్రిగా నటించారు. ఆయన పాత్ర పేరు రొయ్యల నాయుడు. అది విశేషం కాదు.. ఆ సినిమాలో రావు గోపాలరావు ఎలాంటి గెటప్పు వేశారో, సరిగ్గా అదే గెటప్పును 'దువ్వాడ జగన్నాథమ్'లో వేశారు రావు రమేశ్. ఖద్దరు చొక్కా, మోకాలి దాకా ఉండే నిక్కరు, మెడలో కండువా, బుర్ర మీసాలు.. ఇదీ 'ఆ ఒక్కటీ అడక్కు'లో రొయ్యల నాయుడు పాత్రలో రావు గోపాలరావు ఆహార్యం. సేమ్ టు సేమ్ అదే ఆహార్యాన్ని 'డీజే' మూవీలో దించేశారు రావు రమేశ్.
అలా ఆ గెటప్పులో ఆయన నటించాలనే ఆలోచన ఆ సినిమా డైరెక్టర్ హరీశ్ శంకర్ చేశారు. అంతే కాదు.. రొయ్యల నాయుడుగా రావు గోపాలరావు ఎలాంటి డిక్షన్ ఉపయోగించారో. అదే తరహా డిక్షన్‌ను రావు రమేశ్ చేత చేయించారు. కాకపోతే ఈ రెండు పాత్రల మధ్య తేడా.. రావు గోపాలరావు పాత్ర విలన్ కాదు.. రావు రమేశ్ పాత్ర విలన్. అంతే!
![]() |
![]() |