![]() |
![]() |

రి-ఎంట్రీలో దక్షిణాదిన మంచి ఫలితాలనే అందుకుంటోంది చెన్నై పొన్ను శ్రుతి హాసన్. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన `క్రాక్`తో బ్లాక్ బస్టర్ మూటగట్టుకున్న మిస్ హాసన్.. ఉగాది పర్వదినం కానుకగా ఏప్రిల్ 9న జనం ముందుకొచ్చిన `వకీల్ సాబ్`తో మరో విజయాన్ని తన సొంతం చేసుకుంది. రెండు సినిమాల్లోనూ గృహిణి పాత్రల్లోనే కనిపించి అలరించింది.
కట్ చేస్తే.. శ్రుతి హాసన్ నుంచి రాబోతున్న కొత్త సినిమా కూడా.. `క్రాక్`, `వకీల్ సాబ్` తరహాలోనే పండగనే టార్గెట్ చేసుకోవడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి జంటగా శ్రుతి నటించిన తమిళ చిత్రం `లాభమ్`. ఇటీవల స్వర్గస్థులైన ఎస్పీ జననాథన్ రూపొందించిన ఈ సినిమాని.. రంజాన్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు తాజాగా విజయ్ సేతుపతి ట్విట్టర్ లో తెలియజేశారు. దీంతో.. శ్రుతి ఖాతాలో మరో ఫెస్టివల్ రిలీజ్ చేరుతున్నట్లవుతోంది. మరి.. మళ్ళీ పండగ సమయంలోనే రాబోతున్న శ్రుతికి ఈ సారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
కాగా, `లాభమ్`లో విలక్షణ నటుడు జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించగా.. డి. ఇమాన్ సంగీతమందించారు.
![]() |
![]() |