![]() |
![]() |

పాపులర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ చెన్నైలోని సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అతనిపై బీజీపీ ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన టాప్ కమెడియన్ వివేక్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నందనే మృతి చెందారంటూ మన్సూర్ అలీఖాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ సోమవారం ఫిర్యాదు చేసింది.
"వివేక్ మృతి గురించి మన్సూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిపై విమర్శలు చేశారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విధి విధానాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ మాస్కులు ధరించవద్దని ప్రజలకు చెప్తున్నారు. ఇది ప్రజానీకంలో భయాందోళనలను, అయోమయాన్నీ కలిఇస్తోంది. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోన్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఫిర్యాదులో కోరాం." అని బీజేపీ ప్రజాసంక్షేమ స్కీముల ప్రచార విభాగం తమిళనాడు సెక్రటరీ సోము రాజశేఖరన్ తెలిపారు.
కోయంబత్తూర్‌లోని తొండముత్తూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్సూర్ అలీఖాన్ వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్ దగ్గర శనివారం కలకలం సృష్టించాడు. చికిత్స తీసుకుంటూ వివేక్ మృతి చెందింది ఆ హాస్పిటల్‌లోనే. వివేక్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఆరోపించిన మన్సూర్ మాస్కులు ధరించడం ఆపేయమంటూ మీడియా ప్రతినిధులకు చెప్పాడు.
"కొవిడ్-19 వాక్సిన్ తీసుకొమ్మని ప్రజలను బలవంతం చేయవద్దు. కొవిడ్-19 టెస్టులు ఆపాలని ఏడాది నుంచీ నేను చెబుతూనే ఉన్నాను. వాక్సిన్ల గురించి న్యూస్ ఏమీ లేవు. ప్రజల్ని ఎందుకు చంపుతున్నారు? తమను అడిగేవాళ్లు ఉండరని ప్రభుత్వం భావిస్తోందా? వాక్సిన్ తీసుకోవడానికి ముందు రోజు వరకు వివేక్ బాగానే ఉన్నారు. తొండముత్తూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు నేను వీధుల్లోనే పడుకున్నాను, భిక్షగాళ్లతో కలిసి భోజనం చేశాను. నాకేమీ వైరస్ సోకలేదు. ఈ నివారణ చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మాస్కలు తప్పనిసరిగా ధరించాలనడం ప్రభుత్వం తీసుకున్న ఫూలిష్ చర్య." అని ఆయన చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి.
![]() |
![]() |