![]() |
![]() |

``నువ్వు నందవైతే.. నేను బద్రి.. బద్రినాథ్``.. అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన చిత్రం `బద్రి`. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాతో అప్పట్లో యువతరాన్ని విశేషంగా అలరించారు పవన్ కళ్యాణ్. అంతకుముందు చేసిన పాత్రలకు భిన్నంగా సరికొత్త కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంతోనే పవన్ మాజీ శ్రీమతి రేణు దేశాయ్ నాయికగా తొలి అడుగేయగా.. బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, సంగీత, బ్రహ్మానందం, మల్లికార్జున రావు, ఎమ్మెస్ నారాయణ, అలీ, రమాప్రభ తదితరులు ఇతర ముఖ్య భూమికల్లో దర్శనమిచ్చారు.
రమణ గోగుల స్వరకల్పనలో రూపొందిన గీతాలన్నీ అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ``బంగాళాఖాతంలో`` చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలవగా.. ``యే చికితా``, `వేవేల మైనాల గానం``, ``చలిపిడుగుల్లో`, `ఐయామ్ యాన్ ఇండియన్`` పాటలు కూడా ఆదరణ పొందాయి. హిందీలో ఈ చిత్రాన్ని `షర్త్ - ది ఛాలెంజ్` (తుషార్ కపూర్) పేరుతో రీమేక్ చేసి హిందీనాట కూడా తనదైన ముద్ర వేశారు పూరి. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమరావు నిర్మించిన `బద్రి` 2000 ఏప్రిల్ 20న జనం ముందుకొచ్చింది. నేటితో ఈ చిత్రం.. 21 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |