![]() |
![]() |

కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సినిమాల్లో సింహభాగం విజయం సాధించాయి. వాటిలో `హలో బ్రదర్` ఒకటి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన `హలో బ్రదర్`తో నాగ్ కి మాస్ లో మరింత ఫాలోయింగ్ పెరిగింది. దేవా పాత్రలో మాస్ గానూ.. రవివర్మ పాత్రలో క్లాస్ గానూ కనిపించి అభిమానులను అలరించారాయన. ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన ఈ చిత్రంలో నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, సౌందర్య నటించగా.. ఆమని, రంభ, ఇంద్రజ ప్రత్యేక గీతంలో నర్తించారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, శరత్ బాబు, శ్రీహరి, నెపోలియన్, రాజనాల, గిరిబాబు, బాబూ మోహన్, అన్నపూర్ణ, సంగీత, సుధ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రాజ్ - కోటి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. ``ప్రియరాగాలే`` ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిచిపోయింది. ఇక ఇదే సినిమాతో రాజ్ - కోటి `ఉత్తమ సంగీత దర్శకులు`గా `నంది` పురస్కారం పొందారు. హిందీలో ఈ చిత్రాన్ని `జుడ్వా` (సల్మాన్ ఖాన్) పేరుతోనూ, కన్నడంలో `చెలువా` (రవిచంద్రన్) టైటిల్ తోనూ, బెంగాలీలో `భాయ్ జాన్ ఏలో రే` (షకీబ్ ఖాన్) శీర్షికతోనూ రీమేక్ చేశారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన `హలో బ్రదర్` 1994 ఏప్రిల్ 20న విడుదలైంది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 27 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |