![]() |
![]() |

నో డౌట్.. చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగారు. సమకాలీన స్టార్లలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటివాళ్లు సినిమా కుటుంబాల నుంచి వారసులుగా వచ్చి స్టార్లుగా పేరు తెచ్చుకుంటే, చిరంజీవి మాత్రం కష్టేఫలి అనే సూత్రాన్ని నమ్ముకొని, అంచెలంచెలుగా ఎదిగారు. రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో నంబర్ వన్ స్టార్‌గా వెలిగారు. ఇవాళ ఆయన నీడలో ఎంతో మంది ఆయన బంధువుల పిల్లలు హీరోలుగా రాణిస్తున్నారు.
చిరంజీవి బాటలో మొదటగా ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ సైతం నటులుగా మారారు. ఆ ఇద్దరిలో పవన్ కల్యాణ్ చిరంజీవికి సరైన వారసునిగా పేరు తెచ్చుకొని ఫ్యాన్స్‌తో పవర్‌స్టార్ అనిపించుకున్నారు. 'ఖుషి' మూవీతో నంబర్ వన్ రేసులో తానున్నానని తెలియజేశారు. యూత్‌లో ఆయనకు వచ్చిన క్రేజ్ అసాధారణం. తర్వాత కాలంలో డైరెక్టర్ కావాలని ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జాని సినిమా రావడం, వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఘటనల వల్ల ఆయన కాస్త వెనుకపడినట్లు అనిపించినా, ఆయన ఇమేజ్, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు చాటి చెప్తూనే ఉన్నాయి.
అలాంటిది మెగాస్టార్ తర్వాత ఫ్యాన్స్‌లో అంతటి క్రేజ్ ఉంది రామ్‌చరణ్‌కే అన్నట్లు మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాక పుట్టిస్తున్నాయి. చరణ్ బర్త్‌డేని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు సాయితేజ్, వైష్ణవ్ తేజ్ గెస్టులుగా వచ్చారు.
సాయితేజ్ మాట్లాడుతూ, "నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో.. 2004-05 టైమ్‌లో ఆగస్ట్ 21వ తారీఖున పెద్ద మావయ్య (చిరంజీవి)కి బర్త్‌డే విషెస్ చెప్పాలనుకుంటే, ఆయన ఫ్యాన్స్ చేస్తున్న బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు వెళ్తున్నారని చెప్పారు. మేమందరం ఆ ఫంక్షన్‌కు వెళ్లాం. పెద్ద మావయ్యను కలిసి విష్ చేశాం. ఆ తర్వాత సంవత్సరం కూడా అలాగే జరిగింది. మళ్లీ ఇంత ఘనంగా ఎవరికైనా జరుగుతుందా అని అప్పుడు ఆలోచించాను. 2021 మళ్లీ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నా బ్రదర్, మా బావ, నా ఫ్రెండ్‌కు జరిగింది. మీ ఫ్యాన్స్ వల్లే అది జరగడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ థాంక్యూ సో మచ్. మా మావయ్య తర్వాత అంత ప్లేస్‌లో, అంత ప్రేమగా మా చరణ్‌ని చూసుకుంటున్నారు." అని చెప్పాడు.
దాంతో అక్కడకు వచ్చిన ఫ్యాన్స్‌లో చాలా మంది "పవర్‌స్టార్.. పవర్‌స్టార్" అంటూ కేకలేశారు. దాంతో ఆగిపోయిన సాయితేజ్.. "తప్పకుండా అండీ.. పవర్‌స్టార్, మెగాస్టార్ వల్లే ఆయన మెగా పవర్‌స్టార్ అయ్యారు.." అన్నాడే కానీ, మెగాస్టార్ తర్వాత అంతటి ప్రేమ దక్కింది మొదటగా పవర్‌స్టార్‌కి, ఆ తర్వాత మెగా పవర్‌స్టార్‌కి అని చెప్పలేదు. ఈ స్పీచ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో అందులోనూ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ పాయింట్ అయ్యింది. పవర్‌స్టార్ ఇమేజ్, క్రేజ్‌ను సాయితేజ్ లెక్కలోకి తీసుకోలేదనీ, అందుకే మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యాన్స్‌లో అంతటి క్రేజ్ తెచ్చుకుంది రామ్‌చరణే అన్న రీతిలో అతను మాట్లాడాడని చర్చించుకుంటున్నారు.
![]() |
![]() |