![]() |
![]() |

"ఏంటో.. కళ్ళలోన ప్రేమ ఉత్తరాలు అసలెప్పుడు కనలే.. ఏంటో.. గుండెచాటు ఇన్ని సిత్తరాలు ఎదురెప్పుడు అవలే.." అంటూ ఇద్దరు ప్రేమికులు తమ మనసులోని చిత్రాలను బహిర్గతం చేసుకున్న వేళ.. పాట ఎలా ఎగురుతుందంటే.. పాట ఎలా చిందులు వేస్తుందంటే.. 'లవ్ స్టోరీ' మూవీలోని "ఏవోఏవో కలలే.. ఎన్నోఎన్నో తెరలే" పాట వింటే, చూస్తే అర్థమవుతుంది. నాగచైతన్య, సాయిపల్లవి లవ్ స్టోరి ఇది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీలోంచి గురువారం ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సూపర్‌స్టార్ మహేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ లిరికల్ వీడియోను షేర్ చేసి, "Happy to launch the lyrical of #EvoEvoKalale from Love Story! Wishing #NarayanDasNarang garu and the entire team all the best for the film!" అంటూ ట్వీట్ చేశారు.
పండితులకు మాత్రమే బోధపడే క్లిష్టమైన పదాలతో కాకుండా పామరులకు సైతం అర్థమయ్యే తేలిక పదాలతో పాటలు అల్లే భాస్కరభట్ల రవికుమార్ మరోసారి తన శైలి పదాల మాలికతో అందంగా పాటను అల్లాడు. పవన్ సిహెచ్. బాణీలు కూర్చిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఒకవైపు వానజల్లు.. మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి మధ్య ప్రేమజల్లు.. ఇంకే కావాలి.. ఈ పాట మనల్ని మన యవ్వనం నాటి.. లేదంటే కాలేజీ చదువుల నాటి.. లేదూ.. మనలో ప్రేమ చిగురించిన నాటి రోజుల్లోకి తీసుకుపోతుందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
"ఇన్నాళ్ళకీ వచ్చింది విడుదల.. గుండెసడీ పాడింది కిలకిల.. పూలతడీ మెరిసింది మిలమిల.. కంటితడీ నవ్వింది గలగల", "ఏంటో.. మౌనమంత మూటవిప్పినట్టు సరిగమలే పాడే.. ఏంటో.. వానవిల్లు గజ్జె కట్టినట్టు.. కథకళినే ఆడే", "ఏంటో.. ఆశలన్ని పూసగుచ్చడాలు.. ముందెప్పుడు లేదే.. ఏంటో.. ధ్యాసకూడ దారితప్పడాలు.. గమ్మత్తుగ వుందే" లాంటి లైన్లు ప్రేమభాష తెలిసినవాళ్లే రాయగలుగుతారు. స్వయంగా ప్రేమికుడైన భాస్కరభట్ల ఆ భాషలో ఆరితేరినట్లు ఈ పాట తెలియజేస్తోంది.

మామూలుగానే సూపర్బ్ డాన్సర్ అయిన సాయిపల్లవి ఈ పాటలో హద్దే ఎరుగని పురివిప్పిన నెమలిలా నాట్య విన్యాసాలతో అబ్బురపరుస్తుందని అర్థమవుతోంది. సహజంగా డాన్సర్ కాని నాగచైతన్య కూడా ఈ పాట ఇచ్చిన ఉత్సాహంతో, తన ప్రేమను తలచుకుంటూ బాగా డాన్స్ చేశాడనిపిస్తోంది. ఈ సినిమాలో తన మోస్ట్ ఫేవరేట్ సాంగ్ ఇదేనని అతను ఇప్పటికే ప్రకటించేశాడు కూడా! పవన్ బాణీలు, భాస్కరభట్ల పదాలు, శేఖర్ నాట్యాలు.. ఈ పాటను సూపర్ హిట్ చేస్తాయనే గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. 'లవ్ స్టోరి' ఏప్రిల్ 16న విడుదలవుతోంది.
![]() |
![]() |