![]() |
![]() |

నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'లక్ష్య' సినిమా షూటింగ్ ముగింపు దశకొచ్చింది. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కేతికా శర్మ హీరోయిన్. జగపతిబాబు, సచిన్ ఖడేకర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇది నాగశౌర్య 20వ చిత్రం. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో, కమర్షియల్ వాల్యూస్‌తో ఈ మూవీని సంతోష్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇంతదాకా 80 శాతం సన్నివేశాలు పూర్తయ్యాయి. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.
ప్రాచీన కాలంలో ఆర్చరీని వేట, పోరాటాల కోసం ఉపయోగించేవారు. అనేక పౌరాణిక కథలలో విలువిద్య గురించి మనం ఎంతో వివరంగా చదువుకున్నాం. గొప్ప యోధులుగా, దేవుళ్లుగా కనిపించే వ్యక్తులు విల్లుని ధరించే ఉంటారని కూడా మనం విన్నాం. అలాంటి ఆ గొప్ప క్రీడ ఇప్పుడు 'లక్ష్య' రూపంలో వెండితెరపైకి రాబోతుంది. విలువిద్య ఆధారంగా భారతదేశంలో రూపొందుతోన్న మొట్టమొదటి చిత్రం త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. ఆర్చర్ క్యారెక్టర్ నాగశౌర్య నట జీవితంలోనే ఓ మైలురాయి అవుతుందని నిర్మాతలు చెప్తున్నారు.
కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రామ్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా లక్ష్యను నిర్మిస్తున్నారు.
![]() |
![]() |