![]() |
![]() |

న్యూఢిల్లీలో ఈరోజు ప్రకటించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు తెలుగు సినిమాలు రెండేసి అవార్డులు సాధించాయి. 'ఉత్తమ తెలుగు చిత్రం'గా నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన 'జెర్సీ' మూవీ ఎంపికయ్యింది. ఈ ఫిల్మ్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే సినిమాకు 'ఉత్తమ ఎడిటర్'గా నవీన్ నూలికి అవార్డు లభించింది. ఒక లక్ష్యం కోసం ఎన్నడో వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ ఆడిన అర్జున్ అనే క్రికెటర్ కథగా ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయ్యింది.
ఇక మహేశ్ టైటిల్ పాత్రధారిగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన 'మహర్షి' మూవీ 'పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్'గా అవార్డును కైవసం చేసుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇదే చిత్రానికి రాజు సుందరంకు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు కూడా లభించింది. మిలియనీర్ అయిన రిషి అనే బిజినెస్‌మ్యాన్ తన మాతృభూమికి వచ్చి పేద రైతులకు అండగా నిలిచి ఎలా 'మహర్షి'గా పేరు తెచ్చుకున్నాడనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం.
వాస్తవానికి 2020లో ప్రకటించాల్సిన ఈ అవార్డులను కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఈ పురస్కరాలను ప్రకటించింది.
![]() |
![]() |