![]() |
![]() |

పుత్రోత్సాహం అనేది తండ్రికి వాళ్లు పుట్టినప్పుడు కాకుండా, జనం వారిని గొప్పగా పొగిడినప్పుడు కలుగుతుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. జూనియర్ ఎన్టీఆర్ కూడా భవిష్యత్తులో తన ఇద్దరు కొడుకులు అభయ్‌రామ్, భార్గవ్‌రామ్ ఏదైనా సాధించి పేరు తెచ్చుకుంటే సంతోషపడతానని అంటున్నాడు. కీరవాణి చిన్నకొడుకు శ్రీసింహా హీరోగా, పెద్దకొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పనిచేసిన 'తెల్లవారితే గురువారం' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన తారక్ కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాడు.
"అభయ్ కానీ, భార్గవ్ కానీ.. వాళ్లేదైనా సాధిస్తే.. వాళ్లు ఏ రంగంలో ఏం సాధిస్తారో నాకు తెలీదు. బట్.. సాధించిన రోజు వాళ్ల గురించి రెండు ముక్కలు మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగానో లేదా బ్లాంక్‌గానో అయిపోతాననుకుంటా. పిల్లలు విజయం సాధిస్తే ఎలాగైతే తల్లిదండ్రులు సైలెంట్ అయిపోతారో, ఏం మాట్లాడాలో తెలీదో, లోపల్లోపల ఆనందం ఉంటుందో.. అలాగే నా తమ్ముళ్లు సింహా, భైరవ వాళ్లు సాధించిన విజయం గురించి, ఈ రోజు వాళ్లు నిల్చున్న స్థానం గురించి మాట్లాడ్డానికి నాకు మాటలు, పదాలు సమకూర్చుకోలేకపోతున్నాను. ఈ రోజున వాళ్లిద్దర్నీ చూసి నేనేం ఫీలవుతున్నానో, ఏదో రోజు భార్గవ్, అభయ్‌ని చూసి ఇంతే ఆనందపడతానేమో." అంటూ చెప్పుకొచ్చాడు. కీరవాణి-రాజమౌళి కుటుంబం తనకు దేవుడిచ్చిన ఏకైక కుటుంబం అని అభివర్ణించాడు.
శ్రీసింహా హీరోగా నూతన దర్శకుడు మణికాంత్ రూపొందించిన 'తెల్లవారితే గురువారం' చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాయి కొర్రపాటి సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు.
![]() |
![]() |