![]() |
![]() |

అందాల నటుడుగా ప్రేక్షకుల చేత, అభిమానుల చేత నీరాజనాలు అందుకున్న నటభూషణ శోభన్‌బాబు మన మధ్య లేకుండా పోయి నేటికి పదమూడు సంవత్సరాలు. తన ఇంట్లో ప్రమాదవశాత్తూ కిందపడి 2008 మార్చి 20న ఆయన తుదిశ్వాస విడిచారు. ఫ్యామిలీ ఆడియెన్స్ అభిమానాన్ని విపరీతంగా పొందిన ఆయన తన పాత్రలతో ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు, మన హృదయాల్లో నిలిచే ఉన్నారు. మురళీమోహన్ సహా పలువురు ఆర్టిస్టులు శోభన్‌బాబును ఓ విషయంలో ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. భూమి మీద డబ్బు ఇన్వెస్ట్ చేస్తే, అది ఎన్నో రెట్ల ప్రతిఫలాన్నిస్తుందని శోభన్ చెప్పేవారనీ, ఆయన అలాగే చేశారనీ వారంటూ ఉంటారు.
అయితే తాను చాలా పూర్ అండ్ బ్యాడ్ బిజినెస్‌మ్యాన్‌నని తను జీవించి వుండగా ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూలో శోభన్‌బాబు చెప్పారంటే ఆశ్చర్యం కలుగుతుంది. "చిత్రపరిశ్రమలో, బయట కూడా నేనొక పిసినిగొట్టు మనిషిననీ, పెద్ద బిజినెస్‌మ్యాన్‌ననీ అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నా బిజినెస్ మైండ్ ఏంటనేది నాకే తెలుసు. ఐ యామ్ ఎ వెరీ పూర్ బిజినెస్‌మ్యాన్ అండ్ ఎ వెరీ బ్యాడ్ బిజినెస్‌మ్యాన్. ఎందుకంటే రెండు మూడు చిన్న బిజినెస్‌లు ఏవో చేశాను. చేతులు కాలడం కాదు.. చేతులు, కాళ్లు రెండూ కాలిపోయినయ్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుగానే జాగ్రత్త పడటం తప్ప, ఏ బిజినెస్‌లోనూ నేను సాహసాలు చేయలేను. అందుకే సినీ నిర్మాణం జోలికి నేనెప్పుడూ పోలేదు." అని ఆయన చెప్పారు.
నటన విషయంలో ఆయనకు స్ఫూర్తి ఎన్టీఆర్, ఏఎన్నార్. "రామారావు గారు, నాగేశ్వరరావు గారు నటులుగా నాకు స్ఫూర్తినిచ్చారు. యాక్చువల్లీ ఐ వాజ్ స్పిరిటెడ్ ఓన్లీ బై ద టాలెంట్. అంతకు ముందు నాకు స్టేజి అనుభవం కూడా లేదు. వారి సినిమాలు చూసి.. రామారావు గారిలాగుండాలి, నాగేశ్వరరావు గారిలాగుండాలి.. ఈ సీన్‌లో నాగేశ్వరరావు గారు ఇంత అద్భుతంగా చేశారు, ఆ సీన్‌లో రామారావు గారు అంత అద్భుతంగా చేశారు.. అనుకొనేవాడ్ని. ఇదే అప్పటి ప్రాతిపదిక. అంతకంటే ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉండేది కాదు. అప్పుడు ఫారిన్ మూవీస్ చూసే అవకాశాలు కూడా లేవు. అని చెప్పుకొచ్చారు శోభన్‌బాబు.
![]() |
![]() |