![]() |
![]() |

2 నిమిషాల 20 సెకన్ల నిడివి ట్రైలర్‌ను గమనిస్తే, 'రంగ్ దే' మూవీ కథ సారాంశం మనకు అర్థమైపోతోంది. చక్కని రొమాన్స్, కామెడీ కలగలసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని డైరెక్టర్ వెంకీ అట్లూరి తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
"నేను అర్జున్.. దేవుడ్ని నాకొక గాళ్‌ఫ్రెండ్‌ని ప్రసాదించమని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకన్‌కి ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పట్నుంచి తొక్కటం స్టార్ట్ చేసింది.. నా జీవితాన్ని." అని అర్జున్ (నితిన్) చెప్తుండగా ట్రైలర్ స్టార్టయింది. అప్పుడు అర్జున్ బాగా చిన్నోడు. ఆ పాపే పెద్దయ్యాక అను (కీర్తి సురేష్) అయ్యింది.
మనోడు స్టడీస్‌లో బాగా పూర్ అన్నమాట. ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యాడు. అందుకే "ఫెయిలయ్యానని ఫీలవకు." అని అను మెసేజ్ పెట్టింది. అది చదివి, "ఇదీ.. దీని పరామర్శ" అని ఫ్రస్ట్రేట్ అయ్యి, సెల్‌ని నేలకేసి కొట్టబోతే, ఫ్రెండ్స్ సుహాస్, అభినవ్ గోమటం ఆపారు.
అర్జున్ ఫాదర్ (నరేష్)తో అను "అవునంకుల్.. నాకు 95 పర్సెంట్" అని నవ్వుతూ తన మార్కులు చెప్పింది. ఫ్రస్ట్రేషన్‌తో తలకొట్టుకున్నాడు అర్జున్.
"వీడ్ని చదివించే ఓపిక ఇక ఈ మిడిల్ క్లాస్ తండ్రికి లేదు" అని ఈసారి ఫాదర్ ఫ్రస్ట్రేషన్‌తో తల పట్టుకున్నాడు. అర్జున్ అమాయకంగా పక్కనున్న తల్లి (కౌసల్య)తో "అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పావు కదమ్మా" అన్నాడు. అందరూ షాకయినట్లు అతని వంక చూశారు.
"దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఎదవనైపోయా. అందుకే వదిలించేసుకోవాలి. సో.. నేను జీమాటా రాయాలి" అని ఫ్రెండ్స్‌తో సీరియస్‌గా చెప్పాడు అర్జున్. "జీమాట్ ఈజ్ ఎ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్" అని చెప్పాడు సుహాస్. "చిట్టీలు పెట్టొచ్చు కదా?" అని మరోసారి అమాయకంగా అడిగాడు అర్జున్. దాంతో గుండె పట్టేసుకున్నంత పనైంది ఫ్రెండ్స్‌కి.
ఎవరో రౌడీలతో పెట్టుకుంది అను. దాంతో "పెంటమీద రాయేస్తే మన బట్టలే పాడవుతాయ్" అన్నాడు అనుతో అర్జున్. "పర్లేదు. ఇంటికెళ్లి సర్ఫ్ పెట్టి ఉతుక్కుంటాను ప్లీజ్ ప్లీజ్" అని బతిమలాడింది అను. దాంతో ఆ రౌడీలతో ఫైటింగ్ చేసి, చితక్కొట్టాడు అర్జున్.
"మొన్నే మా వాడికి శుక్ర మహర్దశ ఎంటరైంది" అని ఎవరితోనే అర్జున్ ఫాదర్ చెప్పాడు.
కట్ చేస్తే.. రాత్రిపూట అర్జున్, అను ఒక గదిలో రొమాన్స్ చేస్తూ కనిపించారు. పొద్దున్నే నిద్రలేచి, తనను తాను చూసుకొని "అయ్యో" అంటూ ఏడ్పు మొదలుపెట్టాడు అర్జున్. వాళ్లిద్దరి మధ్య జరిగింది తెలుసుకొని అనుని వాళ్లమ్మ చెంపమీద ఎడాపెడా వాయించేసింది.
"ఇంత చేసిందాన్ని ఇంకే ఎదవ పెళ్లి చేసుకుంటాడన్నయ్యా" అని అర్జున్ ఫాదర్ దగ్గర మొరపెట్టుకుంది. దాంతో అర్జున్‌కే ఇచ్చి పెళ్లి చేసేశారు. శోభనం గదిలో అను ఎదురు చూస్తూ ఉంటుంది. బయట "ఒక్కసారి వెళ్లునాన్నా.. నెమ్మదిగా అలవాటైపోతుంది" అని అర్జున్‌కు ఫాదర్ చెప్తాడు. "ఛీఛీ.. బూతులు మాట్లాడకు నాన్నా" అని గయ్యిమని లేస్తాడు అర్జున్.
ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంది అను. ఆ విషయం అర్జున్‌కు చెప్పింది. "ఒక్కసారికే.." అని అర్జున్ నసుగుతుంటే.. "కంగ్రాట్చులేషన్స్.. నువ్వు మగాడివిరా బుజ్జీ" అని చేతులు కలిపింది అను.

"మనం ప్రేమించే వాళ్ల విలువ మనం వాళ్లను వద్దనుకున్నప్పుడు కాదు, వాళ్లు మనల్ని అఖ్ఖర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది." అని అర్జున్ మాటలు బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంటే.. అను విసురుగా నడుస్తూ ఏడుస్తుండటం గమనించవచ్చు.
ఏమైందో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తింటుంటే, అర్జున్‌పై గ్లాసులోని నీళ్లను విసురుగా పోసేసింది అను. అందరూ స్టన్నయిపోయారు.
అనుతో వాళ్లమ్మ "నెక్ట్స్ టైమ్ గొడవ కలవడానికి చెయ్, గెలవడానికి కాదు" అని చెప్తుంది.
ట్రైలర్ చివరలో "మన అనూకి ఏం తక్కువరా?" అడిగాడు అర్జున్‌ను వాళ్ల నాన్న. "అది నాకు నచ్చదు నాన్నా" అన్నాడు అర్జున్. "అదే ఏ.." అని రెట్టించాడు నాన్న. "నీకు ఫిష్ నచ్చదు. ఎవరన్నా హార్ట్‌కి మంచిది.. తినండంటే తింటావా? ఇదీ అంతే." అని చెప్పాడు అర్జున్.
"నాకు ఫిష్ నచ్చదు, నేను ముట్టుకోను. నువ్వు ముట్టుకోకుండానే నీ ఫిష్‌కి కడుపొచ్చిందా?" అని ప్రశ్నించాడు నాన్న.
"నాన్నా.. ఛీ.." అని తల తిప్పుకున్నాడు అర్జున్.
ఇట్లా ఆసక్తికర అంశాలతో, ఉత్కంఠని రేకెత్తించే కథనంతో ఈ సినిమా రూపొందిందని తెలిసిపోతోంది. డైలాగ్స్ కూడా ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అనే విషయం ట్రైలర్ తెలియజేస్తోంది. ఇక రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోగా, నేషనల్ అవార్డ్ విన్నర్ పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాని ఆకర్షణీయంగా మలచింది.
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దేని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న సినిమా విడుదలవుతోంది.
![]() |
![]() |