![]() |
![]() |

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మ్యూజికల్ బ్లాక్ బసర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డీఎస్పీ.. ట్రెండ్ కి తగ్గట్టు ముందుకు సాగడంలో ఘనాపాటి. ఒకవైపు అగ్ర కథానాయకులతోనూ.. మరోవైపు యువ కథానాయకులతోనూ విజయాలు చూస్తూ.. ఒకటిన్నర దశాబ్దానికి పైగా స్టార్ కంపోజర్ గా రాణిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు తమిళ సీమలోనూ తనదైన ముద్రవేశారు. అలాగే, బాలీవుడ్ తన బాణీలు అరువు తీసుకునే స్థాయికి ఎదిగారు.
అలాంటి ఈ స్వరచిచ్చరపిడుగు.. తొలి అడుగు పడి నేటికి సరిగ్గా 22 ఏళ్ళు. డివోషనల్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన `దేవి`(1999)తో దేవిశ్రీ ప్రసాద్ స్వరంగేట్రం చేశారు. `దేవి` మొదలయ్యే సమయానికి డీఎస్పీ టీనేజర్. శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం.. నిర్మాణదశలో జాప్యం కారణంగా ఆలస్యంగా థియేటర్స్ లోకి వచ్చింది. అయితేనేం, పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచింది. కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ, ఎమ్మెస్ రాజు నిర్మాణ దక్షత, విజువల్ ఎఫెక్ట్స్, కథాంశం, నటీనటుల అభినయంతో పాటు దేవిశ్రీ అందించిన పాటలు, నేపథ్య సంగీతం.. `దేవి`కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే.. తెరపైకి రావడంలో ఆలస్యం జరిగినా.. ప్రేక్షక ఆమోదముద్రను కైవసం చేసుకోగలిగింది.
`కుంకుమ పూల తోటలో`, `నీ నవ్వే`, `రామచిలుకల` పాటలతో పాటు సందర్భానుసారం వచ్చే డివోషనల్ సాంగ్స్ కీ దేవిశ్రీ అద్భుతమైన బాణీలు ఇచ్చారు. రెగ్యులర్ సోషల్ డ్రామాతో కాకుండా ఇలా డివోషనల్ ఫాంటసీ సబ్జెక్ట్ తో ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ స్టెప్ లోనే తనదైన ముద్ర వేశారు డీఎస్పీ. ఇప్పటికీ అదే శైలిలో విభిన్న కథాంశాలు చేస్తూ.. అగ్ర స్వరకర్తగా చలామణీ అవుతున్నారు. 22 ఏళ్ళే కాదు.. ఎన్నేళ్ళయినా తన బాణీలకు తిరుగుండేమో అన్నట్లుగా విజయపథంలో దూసుకుపోతున్నారు దేవిశ్రీ ప్రసాద్.
![]() |
![]() |