![]() |
![]() |

ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న తన ప్లాన్స్‌ను విరమించుకోవలసి వచ్చిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, "ఆధ్యాత్మిక రాజకీయాలను" కొనసాగించడానికి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న తమిళనాడుల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి డిసెంబర్ 31న రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. ఆయన పార్టీని నెలకొల్పి, ఎన్నికల్లో నిలబడేట్లయితే 2021లో తమిళనాడు ప్రజలు ఒక ఉత్తేజభరితమైన అసెంబ్లీ ఎన్నికలకు సాక్షులుగా నిలిచేవాళ్లు. ఆ ఎన్నికలు ఊహాతీతంగా ఉండేవి. ఆ అవకాశాన్ని వారిప్పుడు కోల్పోయారు. రజనీకాంత్ లేనప్పుడు, ప్రధాన పోటీ రెండు ప్రధాన ద్రావిడ పార్టీలైన పాలక AIADMK, DMK ల మధ్య ఉంటుందనేది నిర్వివాదం.
సోషల్ మీడియాలో విడుదల చేసిన తన మూడు పేజీల ప్రకటనలో రజనీకాంత్ ఒక తమిళ చిత్రం (అణ్ణాత్తే) సెట్స్‌పై అనారోగ్యానికి గురికావడం గురించి మాట్లాడారు. కొన్నేళ్ల క్రితం మూత్రపిండ మార్పిడి చేయించుకున్న ఈ 70 ఏళ్ల నటుడిని కొవిడ్-19 మహమ్మారి కాలంలో ఎన్నికల ప్రచారం మంచిది కాదని వైద్యులు హెచ్చరించారు. ఒక విషయం స్పష్టం.. ఆయన మొదటి ప్రేమ.. 'సినిమా'. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అది ప్రభావితం చేసుండవచ్చు. అంతే కాదు, తన నాయకత్వం తన పార్టీకి బ్లాక్‌బస్టర్ లాంచ్‌ని ఇస్తుందో, లేదో ఆయనకు తెలియదు. నిజానికి రజనీకాంత్ సినిమాలు ఆయన ఇమేజ్‌పై ఆధారపడి ఉన్నాయి.
ప్రతిభావంతులైన దర్శకులు, సహనటులు, మంచి సంగీతం, తనదైన స్టైల్ డాన్స్ స్టెప్స్, స్టంట్స్, సమకాలీనతను కలిగి ఉండే స్క్రిప్ట్స్‌తో ఆయన లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. దాని వల్ల ఆయన సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల దగ్గర ఒక పండగ వాతావరణం నెలకొని ఉండటం మనం చూస్తూనే వస్తున్నాం. ఆయన సినిమాల పెట్టుబడికి అభిమానులు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఒకవేళ సినిమా డిజాస్టర్ అయితే నిర్మాతకు పరిహారం చెల్లించడంలో ఆయన ప్రసిద్ధి చెందాడు. అయితే ఇలాంటి డిజాస్టర్స్ ఆయన కెరీర్లో చాలా అరుదు.
ఏదేమైనా, తన రాజకీయ అరంగేట్రానికి రజనీకాంత్ ఇలాంటి తారాగణాన్ని, యూనిట్ మెంబర్స్‌ను ఆకర్షించలేకపోయారు. ఇతర పార్టీల నుంచి చిన్న చిన్న పాత్రలు మాత్రమే పోషించిన వ్యక్తులను, రాజకీయాల్లో పెద్దగా పేరుపొందని వ్యక్తులను మాత్రమే తన వద్దకు వచ్చేలా ఆయన చేయగలిగారు. వీటికి తోడు, ఆయన రాజకీయ పాత్రను ఒక జాతీయ పార్టీ నిర్దేశిస్తోందని వదంతులు వచ్చాయి. నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్న హీరో, ఒక బలహీనమైన పొలిటికల్ స్క్రిప్ట్‌ను పైకెత్తడానికి తన బాక్సాఫీస్ స్టామినా కూడా సరిపోదని గుర్తించి ఉండాలి.
1996లో, అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలితకు వ్యతిరేకంగా రజనీకాంత్ నుండి వచ్చిన ఒక పదునైన వ్యాఖ్య ఆమెకు ఆటుపోట్లు తెచ్చిపెట్టింది. జయలలిత, కరుణానిధి ఇద్దరూ మృతులవడం ద్వారా సీన్ నుంచి తప్పుకోవడం, ఇప్పుడు రజనీకాంత్ కూడా ఎంట్రీకి ముందు ఎగ్జిట్ అవడంతో తమిళనాడులో రాజకీయాలను ప్రభావితం చేయగల స్టార్లు లేకుండా పోయారు. సంకేతాలను అర్థం చేసుకోవడంలో రజనీకాంత్ చాలా తెలివైనవారని మరోసారి రుజువైంది. అయితే ఆయన నిర్ణయం కోలీవుడ్‌కు లాభాన్ని చేకూరుస్తుంది.
![]() |
![]() |