![]() |
![]() |

సుమారు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లోకి వచ్చే విషయంలో అభిమానులను టీజ్ చేస్తూ వచ్చారు రజనీకాంత్. ఇప్పుడు దాదాపు పార్టీని మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో ఫ్యాన్స్ గుండెల్ని బద్దలు చేస్తూ, తన ఆరోగ్య స్థితి దృష్ట్యా రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆయన నిర్ణయంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారనడంలో సందేహం లేదు.
సూపర్‌స్టార్ నిర్ణయాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్న పలువురు వీరాభిమానులు చెన్నై, పొయెస్ గార్డెన్‌లో ఉన్న ఆయన నివాసం వద్దకు చేరుకొని నిరసనలకు దిగారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలియజేయాలనీ, పార్టీని ప్రకటించాలని స్లోగన్స్‌తో వారు హోరెత్తించారు. అయితే రజనీ వారి డిమాండ్లకు స్పందించలేదు. బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో ఆయన తీసుకున్న నిర్ణయానికి తిరుగులేదని అర్థమవుతోంది.
2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ఏ పార్టీకీ సపోర్ట్ చేయడం కానీ, రాజకీయాల గురించి మాట్లాడ్డం కానీ చేయరనీ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అణ్ణాత్తే' సినిమా చేస్తున్నారు. రాజకీయాల్లోకి రానని ప్రకటించి, తనను క్షమించమని కోరిన ఆయన సినిమాని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
![]() |
![]() |