![]() |
![]() |

స్వల్ప కాలంలోనే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేశ్. నాగ్ అశ్విన్ సినిమా 'మహానటి'తో ఆమె దశ తిరిగింది. అందులో చేసిన సావిత్రి పాత్రతో జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్న ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే 'మహానటి' మాయలో వరుసగా కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి, భంగపాటుకు గురయ్యింది. దీంతో మేల్కొన్న ఆమె తిరిగి క్రేజీ సినిమాలను ఒప్పుకుంటూ వస్తోంది. వాటిలో మహేశ్‌బాబు సరసన చేస్తున్న 'సర్కారు వారి పాట' కూడా ఉంది.
కాగా కీర్తి పెళ్లి చేసుకోనున్నదంటూ మరోసారి గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి ఆమె పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లయ్యిందంటూ కొన్ని మార్ఫింగ్ ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. తర్వాత ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.
పెళ్లి చేసుకోవాల్సిందిగా కీర్తిని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారంటూ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. కీర్తి తల్లి మేనక ఒకప్పుడు పేరున్న హీరోయిన్. తెలుగులోనూ ఆమె నటించారు. తర్వాత కేరళకు చెందిన బిజినెస్‌మేన్ సురేశ్‌ను పెళ్లి చేసుకొని, నటనకు బై చెప్పారు.
కాగా కీర్తికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం ఇష్టంలేదనీ, నటనను ఆమె బాగా ఎంజాయ్ చేస్తోందనీ, అందుకే మరికొన్నేళ్ల పాటు నటిగా కెరీర్‌ను కొనసాగించాలని భావిస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నితిన్ సరసన కీర్తి నటించిన 'రంగ్ దే' సినిమా జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా 'సర్కారు వారి పాట' షూటింగ్‌లో ఆమె పాల్గొననున్నది.
![]() |
![]() |