![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మ, సిద్ధార్థ తాతోలు జంటగా డైరెక్ట్ చేసిన 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమా గత ఏడాది సరిగ్గా ఏడాది క్రితం (2019 డిసెంబర్ 12) విడుదలైంది. నిజానికి 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' అనే టైటిల్‌తో నవంబర్ 29న రిలీజ్ చెయ్యాలని మొదట ఆయన ప్రయత్నించారు. కానీ సెన్సార్ బోర్డ్ ఆ టైటిల్‌కు అభ్యంతరం తెలపడం, దాని విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, సినిమా టైటిల్ మార్చి, 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' పేరుతో డిసెంబర్ 12న రిలీజ్ చేశారు. తమ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదలవుతుందని నిర్మాత నట్టి కుమార్ ప్రకటించినా, ఆ సినిమాకి అంత సీన్ లేదని తేలిపోయింది.
"మా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారు. ఎవరెవరు ఆపడానికి ప్రయత్నించారో వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతా. సినిమా ఆపడానికి ప్రయత్నించినవారిపై పరువు నష్టం దావా కూడా వేస్తాం." అని విడుదలకు ముందు రోజు రాత్రి ఆన్‌లైన్ ద్వారా వర్మ తెలిపారు. సినిమా విడుదల తర్వాత ఇంద్రసేన చౌదరి, కె.ఎ. పాల్, అప్పటి సెన్సార్ అధికారి జ్యోతి, మరో ముగ్గురు సెన్సార్ బోర్డ్ సభ్యులపై రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు కూడా. కానీ తర్వాత ఆ కేసు సంగతి ఏమైందో, వర్మకు న్యాయం జరిగిందో, లేదో వెల్లడి కాలేదు.
![]() |
![]() |