![]() |
![]() |

నాగార్జున కెరీర్‌లో 'సోగ్గాడే చిన్నినాయనా' బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2016 సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నాగార్జున ద్విపాత్రాభినయం చేసి, ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ సినిమాతో కల్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోటే అతను నాగార్జునకు కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్ ఇవ్వడం విశేషం. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్లను వసూలు చేసింది.
ఆ మూవీ తర్వాత నాగార్జునకు ఇంతదాకా ఆ స్థాయి హిట్ రాలేదు. 'ఊపిరి' విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఆ సినిమాతో తనకు నష్టాలు వచ్చాయని స్వయంగా నిర్మాత పీవీవీ తెలియజేసిన విషయం విదితమే. 'ఓం నమో వేంకటేశాయ' డిజాస్టర్ కాగా, 'రాజుగారి గది 3' బిలో యావరేజ్ అయ్యింది. రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో చేసిన 'ఆఫీసర్' అయితే నాగ్ కెరీర్ వరస్ట్ మూవీగా చెత్త రికార్డ్ సొంతం చేసుకుంది. దానికి రూ. కోటి కూడా షేర్ రాకపోవడంతో నాగ్ షాక్‌కు గురయ్యారు.
నానితో కలిసి నటించిన 'దేవదాస్' ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. రకుల్‌ప్రీత్ సింగ్‌తో రొమాన్స్ చేసిన 'మన్మథుడు 2' డిజాస్టర్ కావడమే కాకుండా, 60 ఏళ్ల వయసులో చేసిన కాసనోవా టైప్ క్యారెక్టర్‌తో బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకున్నారు నాగ్. దాంతో రూట్ మార్చిన ఆయన 'వైల్డ్ డాగ్' అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు. దీని షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా తనకు ఊరటనిస్తుందని ఆయన ఆశిస్తున్నారు.
కాగా 'సోగ్గాడే చిన్నినాయనా'కు సీక్వెల్‌గా 'బంగార్రాజు' చేస్తానని చాలా కాలం క్రితమే అక్కినేని హీరో ప్రకటించారు. రెండేళ్ల నుంచీ ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతూ వస్తోంది కానీ, ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో 'బంగార్రాజు'ను కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో ఆయన ప్రారంభించడం ఖాయమని వినిపిస్తోంది. ఈ సినిమా కోసమే కల్యాణ్ కృష్ణ వేరే సినిమా చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. ఇందులో నాగచైతన్య కూడా నటించనున్నాడు. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఎలాగైతే బ్లాక్‌బస్టర్ అయ్యిందో, 'బంగార్రాజు' కూడా ఆ రేంజ్ హిట్టయి, తన ఫ్యాన్స్‌ను అలరింస్తుందని నాగ్ ఆశిస్తున్నారు. ఆయన ఆశలు నెరవేరుతాయో, లేదో చూద్దాం...
![]() |
![]() |