![]() |
![]() |

నలుగురు 80ల నాటి స్టార్ హీరోయిన్లు కలిసి నటించిన ఓ సినిమా మూడేళ్లుగా విడుదల కోసం ఎదురుచూస్తోంది. తమిళంలో రూపొందిన ఆ సినిమా పేరు 'ఓ అంధ నాట్‌కల్'. అందులో నటించిన వెటరన్ హీరోయిన్లు.. రాధిక, సుహాసిని, ఖుష్బూ, ఊర్వశి. జేమ్స్ వసంతన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇందులో నటించిన నలుగురు నాయికలూ గతంలో తాము హీరోయిన్లుగా నటించిన సినిమాల్లో చేసిన పాత్రలను ఈ సినిమాలో కొనసాగించడం.
'సింధు భైరవి' (1985)లో తాను చేసిన సింధు పాత్రను సుహాసిని, 'రెండు తోకల పిట్ట' (1987)లో తాను చేసిన రాధ పాత్రను రాధిక, 'మైఖేల్ మదన కామ రాజు' (1990)లో తాను చేసిన త్రిపురసుందరి పాత్రను ఊర్వశి, 'మన్నన్' (1992)లో తాను చేసిన మీనా పాత్రను ఖుష్బూ ఈ మూవీలో చేశారు. ఆ నలుగురూ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఏం చేశారనేది ఇందులోని ప్రధానాంశం. మెల్‌బోర్న్ పరిసర ప్రాంతాలలో దీని షూటింగ్ నిర్వహించారు. 1980ల నాటి హీరోయిన్లు నలుగురు ఓ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించడం ఇదే ప్రథమం. ఇలాంటి అరుదైన సినిమా ఇంతదాకా విడుదలకు నోచుకోకపోవడం శోచనీయం. ఈ సినిమా విడుదలకు అడ్డంకులేమిటనేది వెల్లడి కాలేదు.

![]() |
![]() |