![]() |
![]() |

సినీ సెలబ్రిటీలను కరోనా మహమ్మారి వదలనంటోంది. ఒకరి తర్వాత ఒకరుగా సినీ తారలను కరోనా వైరస్ సోకుతోంది. తాజాగా తమిళ స్టార్ యాక్టర్, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన శరత్ కుమార్‌కు కొవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా శరత్ కుమార్ భార్య, సీనియర్ నటి రాధిక వెల్లడించారు. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలూ కనిపించలేదనీ, ప్రస్తుతం వైద్య చికిత్స తీసుకుంటున్నారనీ ఆమె తెలిపారు.
మంగళవారం రాధిక, "హైదరాబాద్‌లో శరత్‌కు కరోనా వైరస్ ఉన్నట్లు ఈరోజు నిర్ధారణ అయ్యింది. ఆయనలో ఎలాంటి లక్షణాలూ లేవు. చాలా మంచి వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. రానున్న రోజుల్లో ఆయన ఆరోగ్యం గురించి అప్‌డేట్స్ ఇస్తుంటాను" అని ఆమె ట్వీట్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలోని ఫిట్‌నెస్ ఐకాన్స్‌లో ఒకరిగా శరత్‌కుమార్ పేరుపొందారు. 66 సంవత్సరాల వయసులోనూ ఆయన రోజూ వ్యాయాయం చేస్తుంటారు. తన వర్కవుట్ పిక్చర్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఇన్‌స్పైర్ చేస్తుంటారు.
రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లోని ఓ జిమ్‌లో సహ నటుడు, స్నేహితుడు సోనూ సూద్‌ను ఆయన కలిశారు. సోను సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, అతడిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలిపారు కూడా.
![]() |
![]() |