![]() |
![]() |

విజయ్‌భాస్కర్ డైరెక్షన్‌లో 'ప్రేమకావాలి' (2011) చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడైన ఆది.. పర్ఫార్మెన్స్ పరంగా, డాన్సుల పరంగా డెబ్యూ మూవీలోనే ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ అతడికి ప్రోత్సాహాన్నిస్తే, రెండో సినిమా 'లవ్‌లీ' (2012) నమ్మకాన్నిచ్చింది. జయ బి. డైరెక్ట్ చేసిన ఆ మూవీతో కమర్షియల్ హీరోకు కావాల్సిన లక్షణాలున్నాయనే అభిప్రాయాన్ని కలిగించాడు.
కొడుక్కు రెండు వరుస హిట్లు రావడంతో సాయికుమార్ ఎంత ఆనందించారో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తను హీరోగా కొంతకాలమే మెప్పించగలిగాననీ, తర్వాత అనివార్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాల్సి వచ్చిందనే నిజం ఆయనను వెన్నాడుతుంటుంది. అందుకే హీరోగా ఆది టాలీవుడ్‌లో తనదైన మార్కెట్‌ను సాధిస్తే చూడాలని ఆయన ఆశించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఆది కెరీర్ తిరోగమన బాట పట్టింది.
ఆ తర్వాత చేసిన పదకొండు సినిమాల్లో సక్సెస్ అయ్యింది ఒకే ఒక్క సినిమా. అది 2016లో వచ్చిన 'చుట్టాలబ్బాయి'. మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 'చుట్టాలబ్బాయి'కి ముందు ఐదు వరుస ఫ్లాపులు, దాని తర్వాత వరుస ఐదు ఫ్లాపులను చవిచూశాడు ఆది. అంటే ఇప్పటివరకు కెరీర్‌లో 13 సినిమాలు చేస్తే, సక్సెస్ అయినవి మూడంటే మూడు. సక్సెస్ రేట్ 23 శాతం మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. అతడి కెరీర్ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని ఇట్టే గ్రహించవచ్చు.
కెరీర్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అతడు 'జంగిల్', 'శశి' అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో 'జంగిల్' ఇటు తెలుగు, అటు తమిళంలో ద్విభాషా చిత్రంగా తయారవుతుంటే, 'శశి' ఓ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాల్లో ఒక్కటి ఆడినా, ఆదికి అది పెద్ద బూస్టప్‌నిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.
![]() |
![]() |