![]() |
![]() |

సుప్రసిద్ధ రచయిత, తెలుగు సాహిత్యం దిశను మార్చేసి, ఒక్క కుదుపు కుదిపి, స్త్రీవాద సాహిత్యానికి ఆద్యునిగా నిలిచిన గుడిపాటి వెంకటాచలం రచించిన 1927 నాటి విఖ్యాత నవల 'మైదానం' ఆధారంగా అదే పేరుతో సినిమా రూపొందనున్నది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి అందిస్తున్నారు. దీని కోసం ఆయన వేణు ఊడుగుల ప్రొడక్షన్ హౌస్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పడం గమనార్హం. 'నీదీ నాదీ ఒకే కథ' దర్శకుడైన ఆయన ప్రస్తుతం 'విరాటపర్వం'ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
కవి సిద్ధార్థ్ డైరెక్ట్ చేయనున్న 'మైదానం' చిత్రానికి వి.ఎస్. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేశ్ బొబ్బిలి సంగీత దర్శకునిగా పనిచేస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్త్రీ లైంగిక స్వేచ్ఛను, ఆమె భావ స్వాతంత్ర్యాన్ని చర్చించిన నవలగా తెలుగు సాహితీ లోకంలో మైదానం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ నవల అప్పటి నుంచి ఇప్పటికీ ఎంతోమంది ఔత్సాహిక రచయితలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. కొంతమంది సంప్రదాయవాదులు దాన్ని బూతు నవలగా చిత్రీకరించినప్పటికీ, రచయితలపై 'మైదానం' ప్రభావం అసామాన్యం. ఆ నవలలో చలం ఉపయోగించిన శైలిని అనుసరించే వాళ్లు ఇప్పటికీ ఉన్నారంటేనే ఆ నవల గొప్పతనం ఏమిటనేది అర్థమవుతుంది.
ఈ నవలలో ప్రధానమైన రాజేశ్వరి పాత్రను ఎవరు చేస్తారనేది ఆసక్తికరం. నటీనటుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. త్వరలో షూటింగ్‌ను ప్రారంభిస్తామని నిర్మాత వేణు ఊడుగుల చెప్పారు. "మహారచయత చలం, స్త్రీ అస్తిత్వానికి జీవ ప్రతిష్ట చేశాడు. స్త్రీ లేకపోతే పురుషుడు లేడని తత్వబంధనంతో తేల్చిచెప్పాడు. 1927లో రాసిన #Maidanam Classical& Social revolutionary నవల మేం నిర్మిస్తోన్న మొదటి చిత్రం. ఈ చిత్రం మా యొక్క వాఖ్యానం మాత్రమే. షూటింగ్ త్వరలో ప్రారంభం!" అని ఆయన తెలిపారు.

![]() |
![]() |