![]() |
![]() |

డైరెక్టర్ అమిత్ వి. మసుర్కర్‌కు 'న్యూటన్' కేవలం రెండో చిత్రం. ఆరేళ్ల క్రితం 'సులేమాని కీడ' అనే సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. రెండో సినిమా కోసం ఆయన దృష్టి మన ఎన్నికల వ్యవస్థపై, అందులోనూ పోలింగ్ బూత్‌పై పడింది. ప్రజాస్వామ్యానికీ, పోలింగ్ బూత్‌కూ అవినాభావ సంబంధం ఉందనే విషయం ఆయనకు అర్థమైంది. ఒక సాధారణ పౌరుడు ఓటు వేసి, తన మనోగతాన్ని వెల్లడించే పోలింగ్ బూత్ చుట్టూ ఎందుకు సినిమాని నడపకూడదనే ఆలోచన వచ్చిందే తడవుగా 'న్యూటన్' కథను అల్లాడు అమిత్.
న్యూటన్ అనేది కథానాయకుడి పేరు. నిజానికతని పేరు అది కాదు.. నూతన్ కుమార్! కానీ 'న్యూటన్' అని పిలిపించుకోవడానికే అతను ఇష్టపడతాడు. ఎన్నికల అధికారి అయిన అతను చత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వెళ్లి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేది ప్రధానాంశం. కథ ప్రకారం దండకారణ్యంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో కేవలం 76 ఓటర్లు ఉండే ఒక పోలింగ్ బూత్‌లో డ్యూటీ చేయడానికి వెళ్తాడు న్యూటన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ఎలా ఉంటుందో ఆ ఓటర్లకు తెలీదు. కనీసం పోలింగ్ అభ్యర్థుల గురించి విననైనా లేదు వాళ్లు. అక్కడ డ్యూటీ ఒక వృథా ప్రయాస అని అక్కడి సీఆర్‌పీఎఫ్ ఆఫీసర్ ఆత్మాసింగ్ (పంకజ్ త్రిపాఠి)కి తెలుసు. కానీ న్యూటన్ లక్ష్యం ఒక్కటే.. అవినీతికి తావు లేకుండా స్వేచ్ఛగా పోలింగ్ జరపడం!
తన విధుల్ని నిజాయితీగా నిర్వర్తించాలనుకొనే ఒక ఉద్యోగికి మన ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో హృదయాన్ని స్పృశించేలా, ఒకింత డార్క్ కామెడీని జోడించి, ఈ చిత్రాన్ని రూపొందించాడు అమిత్. కథలో ఏ ప్రదేశం గురించి చెప్పాడో అదే ప్రదేశంలో షూటింగ్ నిర్వహించాడు. దండకారణ్యంలోకి షూటింగ్ నిమిత్తం జనరేటర్లను, లైట్లను తీసుకెళ్లడం కుదరదు. అందుకే పగటి వెలుతురులో షూటింగ్ జరిపాడు. వేకువ సన్నివేశాల్ని వేకువలో, మధ్యాహ్న సన్నివేశాల్ని మధ్యాహ్నం తీశాడు. వెలుతురు మందగిస్తే మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. అమిత్ ఎక్కడైతే షూటింగ్ నిర్వహించాడో ఆ చోటు ప్రభుత్వం ప్రకారం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయితే అటు ప్రభుత్వం కానీ, ఇటు నక్సల్స్ కానీ 'న్యూటన్' షూటింగ్‌కు ఆటంకం కలిగించలేదు.
న్యూటన్‌గా టైటిల్ రోల్‌లో రాజ్‌కుమార్ రావ్ నటన అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. 'షాహిద్' లాంటి సీరియస్ సినిమాతో ప్రతిభావంతుడైన నటునిగా దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఆయన 'బరేలీ కీ బర్ఫీ' చిత్రంలో కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'న్యూటన్' స్ట్రీమింగ్ అవుతోంది.
![]() |
![]() |