![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మీ బాంబ్' సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌ను చాలా మంది ఇష్టపడ్డారు. అక్షయ్‌కుమార్ చేసిన పాత్ర గురించి చర్చించుకుంటున్నారు. కానీ ఆ సినిమా నిర్మాతలు మాత్రం భయపడుతున్నారు. జనం తమ సినిమాను ఎక్కడ బాయ్‌కాట్ చేస్తారో, ట్రైలర్‌ను డిస్‌లైక్స్‌తో నింపేస్తారోననే భయంతో ట్రైలర్‌ను రిలీజ్ చేసేటప్పుడే ఓ జాగ్రత్త తీసుకున్నారు.
నిజమే.. ఇటీవల కొన్ని సినిమాలను జనం బహిష్కరించారు. 'సడక్ 2' మూవీ ఇందుకు ఉదాహరణ. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు బాయ్‌కాట్ చేశారు. ఓటీటీలో రిలీజైన ఆ సినిమా డిజాస్టర్‌గా నమోదైంది. అంతకు ముందు 'సడక్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు, దానిపై నెటిజన్లు తీవ్ర అయిష్టతను ప్రదర్శించారు. దానికి చాలా తక్కువ లైక్స్ రాగా, అత్యధిక సంఖ్యలో డిస్‌లైక్స్ వచ్చిన బాలీవుడ్ మూవీ ట్రైలర్‌గా అది చెత్త రికార్డును సైతం సొంతం చేసుకుంది. దానికి మిలియన్ల కొద్దీ డిస్‌లైక్స్ వచ్చాయి.
ఆ సినిమాకు ఎదురైన అనుభవమే 'లక్ష్మీ బాంబ్'కు కూడా ఎదురవుతుందేమోనని అక్షయ్‌కుమార్ అండ్ టీమ్ భయపడినట్లు ఇప్పుడు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసేటప్పుడే వీడియోలో లైక్స్, డిస్‌లైక్స్ ఆప్షన్స్‌ను తీసేశారు. ఫలితంగా వీడియోలో లైక్స్, డిస్‌లైక్స్ ఆప్షన్స్ మనకు కనిపించవు. దాంతో పాటు ఆ ట్రైలర్ ఎంతమంది నచ్చింది, ఎంతమందికి నచ్చలేదో కూడా మనకు తెలీదు.
ఇటీవల డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను బెంబేలెత్తించిన టైమ్‌లో అక్షయ్‌కుమార్ ఓ వీడియో షేర్ చేసి బాలీవుడ్‌కు సపోర్ట్ నిచ్చాడు. బాలీవుడ్‌లో ఉన్నవాళ్లందరూ డ్రగ్స్ తీసుకోవట్లేదని ఆయన చెప్పాడు. బాలీవుడ్‌లో డ్రగ్స్ సమస్య లేదని తాను చెప్పడం లేదనీ, అయితే ఇక్కడ ఉన్నవాళ్లందరూ అవి తీసుకుంటున్నారని అర్థం కాదనీ ఆయన అన్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలకు అనుకూలంగా అక్షయ్ మాట్లాడిన మాటలు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. వారంతా అక్షయ్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, 'లక్ష్మీ బాంబ్' సినిమాని నిషేధించాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో '#బాయ్‌కాట్‌లక్ష్మీబాంబ్' అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది కూడా.
సినిమా విషయానికి వస్తే, కామెడీ హారర్ థ్రిల్లర్‌గా 'లక్ష్మీ బాంబ్' మూవీ రూపొందింది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు. తనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన 'ముని 2: కాంచన' సినిమాకి రీమేక్‌గా 'లక్ష్మీ బాంబ్'ను ఆయన రూపొందించాడు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండి, సినిమాపై అంచనాలను పెంచింది. అక్టోబర్ 9న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదల కానున్నది.
![]() |
![]() |