![]() |
![]() |

అభినయంలోనూ, వాచకంలోనూ, నాణ్యమైన నడకలోనూ తనదైన బాణీని సృష్టించుకున్న యాక్టర్ రెబల్‌స్టార్ కృష్ణంరాజు. మొదట విలన్‌గా రాణించి, తర్వాత హీరోగా స్థిరపడే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కృష్ణంరాజేనని చెప్పాలి. తొలిసారి హీరోగా 'చిలక గోరింక' చిత్రంలో అవకాశం సంపాదించి ఇండస్ట్రీని ఆకర్షించిన ఆయనకు తర్వాత రెండేళ్ల పాటు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కృష్ణ హీరోగా డూండీ నిర్మించిన 'నేనంటే నేనే' సినిమాలో విలన్‌గా నటించే చాన్స్ వచ్చింది.
హీరోగా పరిచయమై విలన్ క్యారెక్టర్ వెయ్యాలా, వద్దా అనే సంశయం కృష్ణంరాజులో తలెత్తింది. "అనుభవం వస్తుంది.. చెయ్" అని పెద్దలు ప్రోత్సహించడంతో ఆ సినిమాలో విలన్‌గా నటించారు. ఆ సినిమా విజయం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో విలన్ ఆఫర్లు బాగా వచ్చాయి. ఆ తర్వాత పాలిష్డ్ విలన్‌గా, రొమాంటిక్ విలన్‌గా రాణించారు. అలాంటి సమయంలోనే ఆయనకు హీరో ఆఫర్లు రావడం ప్రారంభించాయి. విలన్ నుంచి హీరో పాత్రలవైపు మళ్లారు.
తొలిసారి నిర్మాతగా మారి, మిత్రులతో కలిసి 'కృష్ణవేణి' చిత్రాన్ని నిర్మించారు. బాపు డైరెక్షన్‌లో చేసిన 'భక్త కన్నప్ప' సినిమా కృష్ణంరాజును బిజీ హీరోగా మార్చింది. మనవూరి పాండవులు, అమరదీపం చిత్రాలలో సాత్విక కథానాయకుడిగానే కాకుండా, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, రావణ బ్రహ్మ లాంటి చిత్రాలలో వీరత్వాన్ని, రౌద్రాన్ని ప్రదర్శించే కథానాయకుడిగా కృష్ణంరాజు కీర్తిని పెంచాయి. ముఖ్యంగా కృష్ణ చెయ్యాల్సిన 'కటకటాల రుద్రయ్య' సినిమా అవకాశం ఆయనకు లభించడం కృష్ణంరాజు కెరీర్‌ని కీలక మలుపు తిప్పింది.
![]() |
![]() |