![]() |
![]() |
.jpg)
జూలై 10న సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక ట్వీట్ చేశారు. అది పద్మాలయా స్టూడియోస్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసిన ట్వీట్. పద్మాలయా స్టూడియోస్‌ది గ్లోరియస్ జర్నీ అనీ, దాని వ్యవస్థాపక సభ్యులకు అభినందనలనీ అందులో రాసుకొచ్చారు. మన తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ బ్యానర్ నుంచి కొన్ని గొప్ప ఎంటర్‌టైనింగ్ ఫిలిమ్స్‌ను రూపొందించి అందించారంటూ పొగిడారు. బాగానే ఉంది. మరి 50 ఏళ్ల తర్వాత ఆ బ్యానర్ ఎక్కడుంది? అని చూస్తే నిరాశ కలుగుతోందని ఆ బ్యానర్ అభిమానులు వాపోతున్నారు. 'మోసగాళ్లకు మోసగాడు' వంటి ఐకనిక్ మూవీతో శ్రీ పద్మాలయా ఫిలిమ్స్ పేరిట మొదలై ఆ సంస్థ.. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం, ఈనాడు, సింహాసనం, మరణ శాసనం, ముగ్గురు కొడుకులు, రాజకీయ చదరంగం, కొడుకు దిద్దిన కాపురం వంటి చిత్రాలను అందించింది. ఆ బ్యానర్ కింద వచ్చిన చివరి సినిమా 'వంశీ'.
ఆ తర్వాత పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌ను పక్కన పెట్టేశారు. ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవడం, హైదరాబాద్‌లోని స్టూడియోస్ ఉన్న స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు అమ్మేశారనే ఆరోపణలతో పద్మాలయా బేనర్ తన ప్రతిష్ఠను కోల్పోయింది. సీనియర్ సూపర్ స్టార్ కన్న కలలకు రూపంగా తయారైన ఆ స్టూడియోస్‌ను నిలబెట్టుకోవాలని ఎవరూ ప్రయత్నించినట్లు కనిపించదు. తండ్రి తర్వాత నేటి సూపర్ స్టార్‌గా ఎదిగిన మహేశ్ సైతం పద్మాలయా బేనర్‌ను కొనసాగించకుండా, ఘట్టమనేని మహేశ్‌బాబు (జీఎంబీ) ఎంటర్‌టైన్‌మెంట్ అనే సొంత బ్యానర్‌ను నెలకొల్పి, దాని కింద తను నటించే సినిమాల బిజినెస్‌లో వాటాలు అందుకుంటున్నాడు. మహేశ్ అక్క మంజుల సైతం తమ తల్లి పేరిట ఇందిరా ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశారు. తొలిగా 'షో' అనే మూవీ నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన 'మనసుకు నచ్చింది' సినిమా దాకా ఆ బ్యానర్ మీదే తీస్తున్నారు. అదే విధంగా మహేశ్ అన్న రమేశ్ బాబుకు సైతం ఓ సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. దాని పేరు కృష్ణా ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. ఆ బ్యానర్‌పై 'అర్జున్', 'అతిథి' సినిమాలు తీశారు.
ఇలా సూపర్ స్టార్ కృష్ణ పిల్లలు ఎవరికి వాళ్లు సొంత ప్రొడక్షన్ హౌస్‌లు పెట్టుకొని వాటికింద సినిమాలు తీస్తున్నారే కానీ గొప్ప చరిత్ర కలిగిన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌ను పునరుద్ధరించి, దానిపై సినిమాలు తీయాలనే ఆలోచన మాత్రం చేయట్లేదు. కారణం ఏమిటో వారికే తెలియాలి.
![]() |
![]() |