![]() |
![]() |
.jpg)
హిందీ సినిమా ఇండస్ట్రీ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. గత నాలుగైదు రోజులుగా కంగనా రనౌత్ వర్సెస్ తాప్సీ మధ్య జరుగుతున్న ట్వీట్ వార్ ఇక ముగిసినట్టే అనుకోవాలి. కంగనా మాట్లాడితే మాట్లాడవచ్చు. తాప్సీ మాత్రం హుందాగా గొడవకి ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తరవాత హిందీ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమ్, బాలీవుడ్ మాఫియా గురించి కంగనా రనౌత్ విపరీతంగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా తాప్సీ, స్వర భాస్కర్ బీ గ్రేడ్ యాక్టర్స్ అని కామెంట్ చేశారు. కంగనా రనౌత్ మాటలపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క ఏడాదిలో మూడు వందల కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించిన సినిమాల్లో నటించిన తాప్సీని, నటనతో ఎంతోమంది అభిమానం పొందిన తాప్సీని పట్టుకుని కంగనా బీ గ్రేడ్ యాక్టర్ అని ఎలా అంటుందని చాలామంది విస్మయం వ్యక్తం చేశారు. తాప్సీ వెటకారంగా స్పందించారు. స్వర భాస్కర్ సైతం సెటైర్స్ వేశారు.
గతంలో స్టార్ వారసులకు మద్దతుగా కంగనా రనౌత్ మాట్లాడిన మాటలను తాప్సీ ట్వీట్ చేశారు. అంతకు ముందు తనపై చేసిన ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చిన తాప్సీ, చివరకు ఈ గొడవకి ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు.
![]() |
![]() |