![]() |
![]() |
.jpg)
సుప్రసిద్ధ దర్శకురాలు మీరా నాయర్ రూపొందిస్తోన్న 'ఎ సూటబుల్ బాయ్' టీవీ సిరీస్ ట్రైలర్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. కారణం.. అందులో కుర్రాడైన ఇషాన్ ఖట్టర్‌తో ప్రౌఢ అయిన టబు కెమిస్ట్రీ! జ్వలించే కాంక్షతో ఇషాన్‌ను టబు అల్లుకుపోయిన తీరు రసజ్ఞల హృదయాల్లో జ్వాలలు రేపుతోంది. విక్రమ్ సేఠ్ బెస్ట్ సెల్లింగ్ నావెల్ 'ఎ సూటబుల్ బాయ్' ఆధారంగా ఈ సిరీస్‌ని బీబీసీ నిర్మిస్తోంది.
టబు, ఇషాన్ మధ్య నిషిద్ధ ప్రేమను కెమెరాతో బంధించిన వైనం చూస్తుంటే సిరీస్ ఎప్పుడు మన ముందుకు వస్తుందా అనే ఆత్రుత కలుగుతోందనేది నిజం. నటుడు రాజేశ్ ఖట్టర్ కొడుకుగా చిత్రసీమలో అడుగుపెట్టినప్పటికీ, తన సహజసిద్ధమైన ప్రతిభతో చక్కని నటుడిగా తొలి సినిమా 'బియాండ్ ద క్లౌడ్స్' (2017)తోనే నిరూపించుకున్నాడు ఇషాన్. ఆ మూవీని ప్రఖ్యాత ఇరానియన్ డైరెక్టర్ మాజిద్ మాజిద్ రూపొందించాడు. కరణ్ జోహార్ మీడియోకర్ మూవీ 'ధడక్'లోనూ అతడి నటన ఏ స్థాయిలో ఉందో చూశాం.
సబ్జెక్టుల ఎంపికలో చాలా శ్రద్ధ చూపించే ఇషాన్ ఇప్పటి దాకా 9 పెద్ద సినిమాల ఆఫర్లను సైతం వదిలేసుకున్నాడు. వాటిలో విశాల్ భరద్వాజ్ సినిమా కూడా ఉంది. 'ఎ సూటబుల్ బాయ్'లో సమాజం చీదరించుకొనే సయీదా బాయి అనే ఒక ప్రౌఢ స్త్రీతో ప్రేమలో పడే ఒక గౌరవనీయ కుటుంబానికి చెందిన మాన్ కపూర్ అనే యువకుడిగా ఇషాన్ నటిస్తున్నాడు. ఇందులో ఆ ఇద్దరి మధ్య పలు శృంగారభరిత సన్నివేశాలు ఉంటాయని సమాచారం.
నిజ జీవితంలో ఇషాన్ వయసు టబు వయసులో సగం. ఆమెకు 48 అయితే, అతడికి 24. కానీ నటనాపరంగా టబుతో అతను మ్యాచ్ అయ్యాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో మరో కీలక పాత్ర కూడా ఉంది. లత అనే ఆ పాత్రను కొత్తమ్మాయి తాన్యా మణిక్తల పోషించింది. ఈ సిరీస్‌లో తొలి ఎపిసోడ్ జూలై 26న బీబీసీ ఒన్‌లో ప్రసారం కాబోతోంది.
![]() |
![]() |