![]() |
![]() |

బాలీవుడ్ బాద్‌షాగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ 28 సంవత్సరాల సినీ కెరీర్‌ను నేటితో పూర్తి చేసుకున్నాడు. కోట్లాది మంది సినీ ప్రియుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఆయన ఇప్పుడున్న స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డాడు. 1992లో 'దీవానా' మూవీతో ఆయన బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. రాజ్ కన్వర్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో రిషి కపూర్, దివ్య భారతి జంటగా నటించారు. బాజీగర్, డర్, దిల్‌లే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, దిల్ తో పాగల్ హై, కరణ్ అర్జున్, స్వదేశ్, చక్ దే ఇండియా, దిల్‌వాలే, ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.
గురువారం (జూన్ 25)తో ఫిల్మ్ ఇండస్ట్రీలో షారుఖ్ 28 సంవత్సరాల్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. #28GoldenYearsOfSRK అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఆయనకు సంబంధించిన అరుదైన ఫొటోలు, మూవీ స్టిల్స్, వీడియో క్లిప్స్‌ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
కాగా ఆనంద్ ఎల్. రాయ్ డైరెక్షన్‌లో మరుగుజ్జుగా నటిస్తూ ఆయన చేసిన చివరి సినిమా 'జీరో' 2018 డిసెంబర్‌లో రిలీజైంది. దాని తర్వాత ఇప్పటివరకూ ఆయన మరో సినిమాని ఎనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఆయన కొత్త సినిమా ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
![]() |
![]() |