![]() |
![]() |

దర్శకుడిగా సుజీత్ వయసు కేవలం రెండు సినిమాలే. అయితేనేం.. వాటితో స్టైలిష్ ఫిలిమ్ మేకర్‌గా ప్రత్యేక గుర్తింపు దక్కింది సుజీత్‌కి. యువ కథానాయకుడు శర్వానంద్ కాంబినేషన్‌లో రూపొందిన ‘రన్ రాజా రన్’ (2014) సుజిత్‌కి దర్శకుడిగా తొలి చిత్రం కాగా.. స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సాహో’ (2019) రెండో ప్రయత్నం. వీటిలో ‘రన్ రాజా రన్’ మంచి విజయం సాధించగా.. ‘సాహో’ తెలుగునాట నిరాశపరచినా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా త్వరలో తన మూడో చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో చేయబోతున్నాడు సుజీత్. అంతేకాదు.. గత రెండు చిత్రాలు స్ట్రెయిట్ సబ్జెక్టులతో తెరకెక్కగా.. ఈసారి రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ ఆధారంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుంది.
ఇదిలా ఉంటే.. ‘లూసిఫర్’ రీమేక్‌కి బాలీవుడ్ సంగీత దర్శకద్వయం అజయ్ – అతుల్ బాణీలు అందించనున్నారని సమాచారం. ‘షాక్’ (2006) తరువాత అజయ్ – అతుల్ చేయబోయే తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తావించదగ్గ విషయం ఏమిటంటే.. తన తొలి చిత్రం నుంచి కూడా సుజీత్ పరభాషా స్వరకర్తలపైనే ఆసక్తి చూపిస్తుండడం. మొదటి సినిమా ‘రన్ రాజా రన్’కి తమిళ సంగీత దర్శకుడు జిబ్రాన్ బాణీలు అందించగా.. రెండో చిత్రం ‘సాహో’కి బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్ – ఎహసాన్ - లాయ్, తనిష్క్ బాగ్చి, గురు రాంధ్వా, బాద్‌షా స్వరాలు సమకూర్చారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘లూసిఫర్’కి ఉత్తరాది స్వరకర్తలు అజయ్ – అతుల్ బాణీలు అందించనుండడం వార్తల్లో నిలుస్తోంది.
మరి.. మున్ముందు కూడా సుజీత్ ఇదే పంథాని కొనసాగిస్తాడేమో చూడాలి. త్వరలోనే ‘లూసిఫర్’టీమ్‌లో అజయ్ – అతుల్ చేరికపై స్పష్టత వచ్చే అవకాశముంది.
![]() |
![]() |