![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దర్యాప్తులో భాగంగా అతనితో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం కాపీని అందజేయాల్సిందిగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్‌ను ముంబై పోలీసులు అడిగారు. ఆదిత్య చోప్రాకు చెందిన ఆ సంస్థలో సుశాంత్ సింగ్ రెండు సినిమాలు - శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), డిటెక్టివ్ బ్యోమ్‌కేష్ బక్షి (2015) - చేశాడు. సుశాంత్ సింగ్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఇంటరాగేషన్ చేస్తున్న సందర్భంగా వెల్లడైన అంశాల ఆధారంగానే ఈ కాంట్రాక్ట్ కాపీని కచ్చితంగా అందజేయాల్సిందిగా పోలీసులు అడిగినట్లు సమాచారం. బాలీవుడ్ మాఫియా వేధింపుల కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసుల చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సుశాంత్ బిజినెస్ మేనేజర్ శ్రుతీ మోడి, పీఆర్ టీమ్‌లోని రాధికా నిహలానీ స్టేట్‌మెంట్లను వారు రికార్డ్ చేశారు.
సుశాంత్ వద్ద తాను జూలై 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు పనిచేసినట్లు శ్రుతి తన స్టేట్‌మెంట్‌లో భాగంగా తెలిపింది. 'చిచ్చోరే' మూవీ ప్రమోషన్స్ సమయంలో ఆమె సుశాంత్‌తోనే ఉంది. సుశాంత్ భిన్నమైన వ్యక్తిలా కనిపించేవాడనీ, వర్చువల్ రియాలిటీ, నేషన్ ఇండియా ఫర్ ది వరల్డ్, డ్రీమ్ 150 అనే మూడు ముఖ్యమైన కలలు అతనికున్నాయని ఆమె వెల్లడించింది. రియలిస్టిక్ వర్చువల్ గేమ్స్‌తో ఒక కంపెనీని ప్రారంభించడానికి అతను ప్రిపేర్ అయ్యాడని కూడా శ్రుతి చెప్పింది. ఇక పోలీసుల ప్రకారం సుశాంత్ నివాసంలో ఒక ప్రత్యేకమైన టెలిస్కోప్ ఉంది. దాని సాయంతో అతను ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలను పరిశీలిస్తుండేవాడు.
![]() |
![]() |