![]() |
![]() |
.jpg)
'మహానటి' ఫేమ్ కీర్తి సురేశ్ ఇప్పటివరకు తెలుగులో ఒకే ఒక్క టాప్ స్టార్‌తో నటించింది. అది.. పవన్ కల్యాణ్‌తో చేసిన 'అజ్ఞాతవాసి'. ఇప్పుడు సూపర్‌స్టార్‌తో కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురిగా ఆమె నటిస్తోన్న 'అణ్ణాత్తే' గురించి మనం మాట్లాడుకోవడం లేదు. సూపర్‌స్టార్ మహేశ్‌తో చేస్తున్నానని కీర్తి చెప్పింది. అవును. పరశురామ్ డైరెక్షన్‌లో మహేశ్ 'సర్కారు వారి పాట'ను చేస్తున్న విషయం తెలిసిందే. అందులో నాయికగా కీర్తి ఎంపికైందన్న మాట. ఇదివరకు ఈ సినిమాలో నాయికగా ఆమెను పరిగణిస్తున్నారనే విషయం ప్రచారంలోకి వచ్చినా, ఆ తర్వాత బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, సయీ మంజ్రేకర్ పేర్లు కూడా బలంగా వినిపించాయి. ఇప్పుడు కీర్తి స్వయంగా తాను మహేశ్‌తో చేస్తున్నట్లు వెల్లడించి, ఆ ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది.
గురువారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో సంభాషణ సందర్భంగా ఈ విషయాన్ని ఆమె తెలిపింది. 'సర్కారు వారి పాట'లో హీరోయిన్ క్యారెక్టర్‌కు కూడా తగినంత ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. అందుకే మొదట కియారా అద్వానీని తీసుకోవాలని డైరెక్టర్ పరశురామ్ భావించాడనీ, అయితే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్‌లకు డేట్స్ కేటాయించాల్సి ఉన్నందున ఆమె తన అశక్తత తెలిపిందనీ, దాంతో కీర్తిని పరశురామ్ సంప్రదించాడనీ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. క్యారెక్టర్ నచ్చడం, పైగా మహేశ్ సరసన కావడంతో మరో ఆలోచన లేకుండా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
'మహానటి' మూవీ తర్వాత నుంచి కీర్తి ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వస్తోంది. 'పెంగ్విన్' త్వరలో ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, 'మిస్ ఇండియా', 'గుడ్‌లక్ సఖి' సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి రానున్నాయి.
పవన్ కల్యాణ్‌తో చేసిన 'అజ్ఞాతవాసి' ఫెయిలవడంతో, మహేశ్‌తో చేస్తున్న 'సర్కారు వారి పాట'తోనైనా కీర్తి కిరీటంలో బ్లాక్‌బస్టర్ చేరుతుందేమో చూడాల్సిందే.
![]() |
![]() |