![]() |
![]() |

ఇటీవల ఓటీజీ బిజినెస్ లు తగ్గిపోయాయి. విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు కూడా సరైన ఓటీటీ డీల్ రాక ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ఇటీవల షూటింగ్ మొదలుపెట్టిన ఓ సినిమా డిజిటల్ రైట్స్ అప్పుడే అమ్ముడయ్యాయి. అది కూడా ఏకంగా రూ.80 కోట్లకు డీల్ క్లోజ్ కావడం విశేషం. (Suriya 46)
కోలీవుడ్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్ లో 46వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జూన్ లో మొదలైంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రిలీజ్ కి ఇంకా చాలా సమయముండగానే.. ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.80 కోట్లకు స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సూర్య ఫ్లాప్స్ లో ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ఆయన సినిమా ఓటీటీ రైట్స్ కోసం రూ.80 కోట్లు చెల్లించడం అనేది మామూలు విషయం కాదు. అయితే దానికి ప్రధాన కారణం దర్శకుడు వెంకీ అట్లూరి అంటున్నారు. వెంకీ అట్లూరి గత రెండు చిత్రాలు 'సార్', 'లక్కీ భాస్కర్' విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ఆ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ నే సొంతం చేసుకుంది. వెంకీ అట్లూరి కంటెంట్ మీద నమ్మకంతోనే ఇప్పుడు 'సూర్య 46' మూవీ ఓటీటీ రైట్స్ ని కూడా భారీ ధరకు దక్కించుకున్నట్లు వినికిడి.
![]() |
![]() |