![]() |
![]() |

ప్రస్తుతం సినిమాల నిడివి అనే విషయంలో ప్రేక్షకుల అభిరుచి బాగా మారిపోయింది. పాతకాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన చిత్రాలు ఎక్కువ నిడివితో ఎంత పెద్ద చిత్రాలైతే వాటిని ప్రేక్షకులు అంతగా ఎంజాయ్ చేసేవారు. ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలు చూస్తే వాళ్ళకి ఆనందం వేసేది. అతి తక్కువ టికెట్ డబ్బులతో తమను అంతసేపు ఎంటర్టైన్ చేస్తున్న సినిమా వారిని నెత్తికెత్తుకునేవారు. అంత పెద్ద లాంగ్ టైమ్ ఉన్న సినిమా లను చూస్తూ తమ అభిమాన హీరోలను, హీరోయిన్లను నటినటులను వెండితెరపై ఆస్వాదించేవారు. దాంతో లవకుశ, దానవీరశూరకర్ణ వంటి ఎన్నో చిత్రాలు మూడు గంటలకు పైగా నిడివి తో ఉండేవి.
కానీ రాను రాను ఆడియన్స్ ఫాస్ట్ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు సినిమాల నిడివి రెండున్నర గంటలు అంటేనే అబ్బా అనేస్తున్నారు. అంత సేపు ఏం చూస్తాం... బోర్ అవుతుంది... అంతసేపు కూర్చోలేం అని తేల్చేస్తున్నారు. పాత్రలను పరిచయం చేయడానికి ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే క్రమంలో ఏ మాత్రం సాగతీత అనిపించినా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో తెలుగు సినిమాల నిడివి రాను రాను తగ్గుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ వారు కూడా మూడున్నర నాలుగు గంటల నిడివి ఉండే సినిమాలు తీసేవారు. వారు కూడా ప్రస్తుతం తమ నిడివిని తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో రాబోయే కాలంలో మన చిత్రాలు హాలీవుడ్ తరహాలో ఒకటిన్నర గంటల చిత్రాలుగా వస్తే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదేమో? మరోవైపు హాలీవుడ్ చిత్రమైన అవతార్ 2 ఏకంగా మూడున్నర గంటల నిడివితో రావడం విశేషం. అంటే హాలీవుడ్ వారు మన దారిలో నడుస్తుంటే మనం వారి దారిలో నడుస్తున్నామన్నమాట.
ఇక ఈ నిడివి సమస్య వల్ల ప్రస్తుత సినిమాలకు ఎడిటర్ చాలా కీలకపాత్రను పోషిస్తున్నారు. ఏమాత్రం సాగతీత లేకుండా సినిమాలను ట్రిమ్ చేయడం ఎడిటర్లకు కత్తి మీద సాముగా మారింది. ఇక విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ ఊహించని రేంజ్ లో ఉండబోతోంది. దాదాపు అన్ని సినిమాలు కమర్షియల్ పాయింట్స్ తో రాబోతున్నాయి. ఏ మూవీకి అత్యధిక స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తుందో దానికి పండుగలు బాగా కలిసి వస్తాయి. తప్పకుండా ఆ సినిమా భారీ సక్సెస్ అవుతుంది.
ఇక ఈ సంక్రాంతి ఫైట్ లోని సినిమాలలో ఏ సినిమా రన్ టైమ్ ఎంత ఉందనే వివరాల్లోకి వెళితే.. తమిళ హీరో విజయ్ నటించిన 'వారీసు' సినిమా తెలుగులో విజయ్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో వారసుడుగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు. జనవరి 12న నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విడుదలవుతోంది. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 35 నిమిషాలు ఉండబోతోంది. మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య పై సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇందులో రవితేజ కూడా మంచి నిడివి ఉన్న పాత్రను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు. అజిత్ హీరోగా నటించిన తమిళ్ మూవీ 'తునివు'ని 'తెగింపు' పేరుతో తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా రన్ టైము 2 గంటల 23 నిమిషాలు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత దిల్రాజు నైజాంతోపాటు మరికొన్ని ఏరియాలలో ఈ మూవీని పంపిణీ చేయబోతున్నారు. ఇలా చూసుకుంటే అతి తక్కువ నిడివి గల చిత్రంగా తెగింపుని చెప్పుకోవాల్సి వస్తోంది. మరి ఈ చిత్రాలలో ఏ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
![]() |
![]() |