![]() |
![]() |

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య', నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి'లు విడుదల కాబోతున్నాయి. ఇలా ఒకేసారి ఈ ఇద్దరు అతిపెద్ద టాలీవుడ్ హీరోల సినిమాలు వస్తూ ఉండడంతో దిల్ రాజు మాత్రం తమిళ హీరోలతో చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆయన కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా 'వారిసు' చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి ఆయన 'వారసుడు' పేరుతో డబ్ చేస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన 'తునివు' కూడా 'వారిసు'తో పాటు విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'తెగింపు' పేరుతో విడుదల చేస్తున్నారు.
తెలుగులో పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే నైజాంలో దిల్ రాజు వాటిని కచ్చితంగా పంపిణీ చేస్తారు. కానీ ఈసారి ఆయనకు బాలయ్య, చిరు సినిమాలను పంపిణీ చేసే అవకాశం రాలేదు. విజయ్ నటించిన 'వారసుడు'తో పాటు దానికి పోటీగా కోలీవుడ్ లో విడుదలవుతున్న అజిత్ 'తునివు'ను 'తెగింపు' పేరుతో ఆయనే తెలుగులో పలు ఏరియాలలో పంపిణీ చేస్తున్నారు. ఇలా ఆయన రెండు డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయబోతుండడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
తమిళ హీరోల సినిమాలకు ఎక్కువ స్థాయిలో థియేటర్లు ఇవ్వకూడదు అని ఒకవైపు నిర్మాతల మండలి నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ.. దిల్ రాజు మాత్రం విజయ్, అజిత్ సినిమాలను పోటీపడి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా 'తెగింపు' సినిమాకు సంబంధించిన నైజాం హక్కులతో పాటు ఆంధ్రలోని కొన్ని ఏరియాల హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. తమిళంలో పోటీ పడుతున్న చిత్రాలు రెండింటిని ఆయన తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'వారసుడు' సినిమాకు కనీసం కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. కానీ అజిత్ మాత్రం తెలుగులో ఇంతవరకు సరైన కనెక్షన్స్ అయితే అందించలేకపోయారు. అలాంటిది దిల్‌రాజు 'తెగింపు' సినిమాను ఏ ధైర్యంతో విడుదల చేస్తున్నారు? అనేది చాలామందికి అర్థం కాని విషయం.
కానీ ఏమీ ఆలోచించకుండా ఆయన అంత తేలికగా నిర్ణయం తీసుకోరు. లాభాలు లేనిదే ఆయన ఒక అడుగు కూడా ముందుకు వేయరు. కేవలం 'వారసుడు'తోనే థియేటర్లన్నింటినీ నింపడం కష్టం. అలాగని 'వీర సింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' లకు థియేటర్లను ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే ఆయన కావాలని తెగింపు చిత్రాన్ని విడుదల చేస్తున్నారని తద్వారా రెండు భారీ తెలుగు చిత్రాలతో పాటు రెండు తమిళ్ డబ్బింగ్ చిత్రాలకు సరి సమానమైన థియేటర్లు కేటాయించేలా వ్యూహం పన్నాడని అంటున్నారు. మొత్తానికి దిల్‌రాజు పెద్ద రిస్కే చేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. మరి దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
![]() |
![]() |