![]() |
![]() |

విడుదలైన ఆరు రోజుల్లోనే నైజాం(తెలంగాణ)లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి సంచలనం సృష్టించింది 'ఆర్ఆర్ఆర్'. నైజాంలో రూ.70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ ఆరు రోజుల్లో 73.15 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చి పెట్టే దిశగా దూసుకుపోతోంది. నైజాంలో బాహుబలి-2 మొత్తంగా 68 కోట్ల షేర్ వసూలు చేయగా.. ఆర్ఆర్ఆర్ మొదటి వారం కూడా పూర్తి కాకముందే 70 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. సీడెడ్ లోనూ బాహుబలి-2 రికార్డు బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్. సీడెడ్ లో బాహుబలి-2 ఫైనల్ గా 34.75 కోట్లు కలెక్ట్ చేయగా.. ఆరురోజుల్లో 36.03 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఆ రికార్డు బ్రేక్ చేసింది. సీడెడ్ లో 37 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ గురువారం బ్రేక్ ఈవెన్ దాటే అవకాశముంది. ఇక ఆంధ్రాలో 84 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ ఇప్పటిదాకా 70.99 షేర్ కలెక్ట్ చేసి అక్కడా బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తోంది.
ఓవరాల్ గా మాత్రం బాహుబలి-2 రికార్డుని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేయడం కష్టమనే చెప్పాలి. పైగా ఊహించిన దానికంటే ఆరోరోజు కలెక్షన్స్ ఎక్కువ డ్రాప్ అయ్యాయి. నాలుగో రోజు 35.88 కోట్లు, ఐదో రోజు 31.13 కోట్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్.. ఆరోజు రోజు 23.19 కోట్లతో సరిపెట్టుకుంది. ఐదో రోజుతో పోల్చితే ఆరో రోజు 25 శాతానికి పైగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. వర్కింగ్ డేస్ కావడంతో ఏడు, ఎనిమిది రోజుల్లో(గురు, శుక్రవారం) కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. వీకెండ్ లో అద్భుతం చేస్తుందేమో చూడాలి.
ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు 9.54 షేర్ రాబట్టింది. దీంతో ఆరో రోజు కలెక్షన్ల పరంగా ఇప్పటిదాకా టాప్ లో 'సరిలేరు నీకెవ్వరూ' పేరిట ఉన్న 9.52 కోట్ల రికార్డు అతి తక్కువ మార్జిన్ తో బ్రేక్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 74.11 కోట్ల షేర్ వసూలు చేసిన ఆర్ఆర్ఆర్.. రెండో రోజు 31.63 కోట్లు, మూడో రోజు 33.53 కోట్లు, నాలుగో రోజు 17.73 కోట్లు, ఐదో రోజు 13.63 కోట్లతో ఇప్పటిదాకా 180.17 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన 'ఆర్ఆర్ఆర్'.. ఆరు రోజులకే 94 శాతం రికవరీ సాధించింది.
వరల్డ్ వైడ్ గా ఆరో రోజు 23.19 కోట్ల షేర్ రాబట్టిన ఆర్ఆర్ఆర్.. మొదటిరోజు 135 కోట్లు, రెండో రోజు 67.44 కోట్లు, మూడో 78.73 కోట్లు, నాలుగో రోజు 35.88 కోట్లు, ఐదో రోజు 31.13 కోట్లు కలిపి టోటల్ గా ఆరు రోజుల్లో 371.37 కోట్ల షేర్(670 కోట్ల గ్రాస్)తో సంచలనం సృష్టించింది. ఇప్పటిదాకా ఓవర్సీస్ లో 71.20 కోట్లు, హిందీలో 60.10 కోట్లు, కర్ణాటకలో 26.15 కోట్లు, తమిళనాడులో 23.55 కోట్లు, కేరళలో 5.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 4.85 కోట్లు కలెక్ట్ చేసింది. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఆర్ఆర్ఆర్ మరో 81.63 కోట్లు రాబడితే క్లీన్ హిట్ గా నిలవనుంది. అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతూ, కొన్ని చోట్ల బాహుబలి-2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఓవరాల్ గా మాత్రం బాహుబలి-2 ని బీట్ చేసే అవకాశంలేదు. ఎందుకంటే హిందీలో(510 కోట్ల నెట్), ఓవర్సీస్ లో(20 మిలియన్ కి పైగా) బాహుబలి-2 కి వచ్చిన కలెక్షన్స్ చాలా ఎక్కువ.
![]() |
![]() |