![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలలో రీల్ హీరోగానే కాకుండా.. తన సేవ కార్యక్రమాలతో రియల్ హీరోగానూ ఎందరో అభిమానం సంపాదించుకున్నారు. బతికున్నంత కాలం ఎందరికో అండగా నిలిచి, ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపిన ఆయన.. మరణించాక కూడా తన కళ్ళతో నలుగురి జీవితాలలో వెలుగులు నింపారు.
పునీత్ కళ్లతో నలుగురికి చూపు దక్కిందని నారాయణ నేత్రాలయ ఛైర్మన్, ఎండీ భుజంగ్ శెట్టి వెల్లడించారు. సాధారణంగా ఒక వ్యక్తి దానం చేసిన కళ్లతో ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుందని.. అయితే పునీత్ కళ్లలోని కార్నియాలోని సుపీరియర్, డీపర్ లేయర్స్ ని వేరు చేసి నలుగురికి చూపును ప్రసాదించగలిగామని తెలిపారు. ఒక్కో కంటిని ఇద్దరికి చూపును తెప్పించేందుకు వినియోగించామని చెప్పారు. సూపర్ఫీషియల్ కార్నియల్ వ్యాధి ఉన్న ఇద్దరికి సుపీరియర్ లేయర్ మార్పిడి చేశామని.. ఎండోథెలియల్ వ్యాధి/ డీప్ కార్నియల్ లేయర్ వ్యాధి ఉన్న ఇద్దరికి డీపర్ లేయర్ ట్రాన్స్ ప్లాంట్ చేశామని తెలిపారు. ఈ విధంగా పునీత్ కళ్లతో నలుగురికి చూపు దక్కిందని.. మాకు తెలిసి కర్ణాటకలో ఇలాంటి నేత్రదానం ఎక్కడా జరిగి ఉండదు అని అన్నారు.
ఇదిలా ఉంటే కన్నడ స్టార్ పునీత్ అంత్యక్రియలకు చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి పలువురు టాలీవుడ్ స్టార్స్ హజరయ్యి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ నాగార్జున.. బెంగుళూరులోని పునీత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. పునీత్ ఫోటోకు నివాళులర్పించి, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.
![]() |
![]() |