![]() |
![]() |

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా స్టెప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేయడం కోసం స్టార్ హీరోలు ముచ్చటపడతారు. అయితే దర్శకుడిగా మారిపోయాక ఆయన కొరియోగ్రఫీ తగ్గించారు. ముఖ్యంగా ఆయన తెలుగు సినిమాలకు కొరియోగ్రఫీ అందించి చాలా కాలమైంది. అయితే ఇప్పుడు ఆయన మంచు విష్ణు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.
విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అవ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు, రేణుకగా సన్నీలియోన్, స్వాతిగా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి ప్రభుదేవా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకి సంబంధించి ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. విష్ణు, పాయల్ కలిసి చిందేస్తున్న ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తుండటం విశేషం. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకే స్టార్ కాస్ట్ తో బడా టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపుతున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చోటా.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండటం విశేషం.
![]() |
![]() |