![]() |
![]() |

సినిమా పేరు: పరదా
తారాగణం: అనుపమ పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్, గౌతమ్ మీనన్, హర్షవర్ధన్, బలగం సుధాకర్ రెడ్డి, తదితరులు
సంగీతం: గోపి సుందర్
ఎడిటర్: ధర్మేంద్ర కాకేందర్
రచన, దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
సినిమాటోగ్రాఫర్: మ్రిదుల్ సుజిత్ సేన్
బ్యానర్: ఆనంద మీడియా
నిర్మాతలు: శ్రీనివాసులు, విజయ్, శ్రీధర్
విడుదల తేదీ: అగస్ట్ 1 ,2025
'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)టైటిల్ రోల్ పోషించిన 'పరదా'(Paradha)చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో పాటు, సినిమాపై నమ్మకంతో మేకర్స్ రెండు రోజుల ముందే చాలా ఏరియాల్లో ప్రీమియర్ షోస్ కూడా ప్రదర్శించడం జరిగింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్) ది 'పడతి' అనే గ్రామం. కొన్ని ఏళ్ళ తరబడిగా వస్తున్న తన ఊరి ఆచారాల ప్రకారం జీవనాన్ని కొనసాగిస్తు ఉంటుంది. ఆ ఆచారాలపై సుబ్బలక్ష్మికి ప్రగాఢ విశ్వాసం. ఎంతలా అంటే యుక్తవయసుకొచ్చాక తన స్నేహితుడు, ప్రేమికుడు అయిన రాజేష్(రాగ్ మయూర్) ముఖం కూడా చూడదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే ఇద్దరు మాట్లాడుకుంటు ఉంటారు. సుబ్బలక్ష్మి, రాజేష్ కి నిశ్చితార్థం ఏర్పాటవుతుంది. కానీ సుబ్బలక్ష్మి ఫోటో ఫేమస్ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో రావడంతో నిశ్చితార్థం ఆగిపోతుంది. దీంతో గ్రామ ఆచారం ప్రకారం సుబ్బలక్ష్మి తనంతట తానుగా ఆత్మాహుతి చేసుకొని చనిపోవడానికి సిద్ధపడుతుంది. సుబ్బలక్ష్మి కి 'జ్వాలమ్మ' ఒక అవకాశం ఇవ్వడంతో ఆత్మాహుతి ఆగిపోతుంది. ఆ తర్వాత సుబ్బలక్ష్మి పంజాబ్ రాష్ట్రంలోని 'ధర్మస్థలి'కి వెళ్తుంది. ఢిల్లీకి చెందిన అమిష్ట(దర్శనా రాజేంద్రన్) రత్న(సంగీత) లు సుబ్బలక్ష్మి కి తోడుగా ఉంటారు. ఆ ప్రయాణంలో 'పరదా'కి సంబంధించిన అసలు నిజాన్ని సుబ్బలక్ష్మి తెలుసుకుంటుంది. సుబ్బలక్ష్మి పరదా గురించి తెలుసుకున్న నిజం ఏంటి? ధర్మస్థలికి ఎందుకు వచ్చింది? సుబ్బలక్ష్మి కోసం రాజేష్ వెయిట్ చేశాడా? లేక మరో పెళ్లి చేసుకున్నాడా? మ్యాగజైన్ లో సుబ్బలక్ష్మి ఫోటో రావడం వల్ల నిశ్చితార్థం ఎందుకు ఆగింది? ఆ ఫోటో తీసింది ఎవరు? జ్వాలమ్మ ఎవరు? పడతి గ్రామ ఆచారం ఏంటి? ఆ ఆచారం వెనక రహస్యం ఏమైనా దాగి ఉందా? సుబ్బలక్ష్మిని ఆత్మాహుతి ఎందుకు చేయాలనుకున్నారు? ధర్మస్థలి నుంచి వచ్చాక ఆత్మాహుతి ఆగిందా ? గ్రామ ఆచారం విషయంలో సుబ్బు తీసుకున్న నిర్ణయం ఏంటనేదే 'పరదా' చిత్ర కథ
ఎనాలసిస్
ఈ రోజుల్లో మహిళా ప్రాధాన్యతని ఇతివృత్తంగా చేసుకొని, అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా 'పరదా' ని తెరకెక్కించిన దర్శకుడు 'ప్రవీణ్' కి హాట్స్ హాఫ్ చెప్పాలి. ఆడవాళ్లు సమాజం నుంచి ఎదురుకుంటున్న ఎన్నో సవాళ్ళని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కథాంశాలపై మరింత శ్రద్ధ వహించడంతో పాటు, క్లైమాక్స్ పై మరింత ఇంట్రెస్ట్ చూపించాల్సింది. ఈ చిత్రానికి ఆయువు పట్టయిన మెయిన్ పాయింట్ ని సింపుల్ గా ముగించేసి, మిగతా విషయాలకి గ్రాండ్ గా ఎలివేషన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లోనే పరదా కథ ఉద్దేశాన్ని ఒగ్గు కథలో చెప్పించారు. దీంతో కథలోకి ఇన్వాల్స్ అవ్వడంతో పాటు, నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియారిటీ కలుగుతుంది. ఆచారం ప్రకారం సుబ్బలక్ష్మి,రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే పాడు బడిన రైలు బండిలో చెరొక బోగీలో కూర్చొని మాట్లాడుకునే సన్నివేశం చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ పై ఇంకొన్ని సీన్స్ సృష్టించి ఎంటర్ టైన్ మెంట్ ని యాడ్ చేయాల్సింది. సుబ్బలక్ష్మి ఫోటో మ్యాగజైన్ లో రాగానే, నిశ్చితార్థం ఆగకుండా, పెళ్లి దాకా తీసుకొచ్చి టెన్షన్ క్రియేట్ చేయాల్సింది. సుబ్బలక్మి పెద్ద వయసుకొచ్చాక పరాయి వ్యక్తులు ఆమె ముఖం చూడరు. అలాంటప్పుడు మ్యాగజైన్ లో ఉన్న ముఖం తనదేనా, కాదా అనే విషయంలో టెన్షన్ ఉంటే బాగుండేది. ఇక ఈ సన్నివేశం తర్వాత కథ చాలా వేగంగా పరిగెత్తింది. ప్రతి సన్నివేశం ఒక పర్పస్ తో తెరకెక్కడంతో పాటు, ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది. సెకండ్ హాఫ్ పరదా కి అదనపు బలం. తనని తాను తెలుసుకునే ప్రాసెస్ లో సుబ్బలక్ష్మి ఎదురుకున్న ఘట్టాలు, అమిష్ట తో ప్రయాణం, అమిష్ట లైఫ్ స్టైల్ సన్నివేశాలు, రాజేంద్రప్రసాద్ గారి ఫిలాసఫీ సీన్స్, ముఖ్యంగా ధర్మశాల అందాలు, అందుకు తగ్గట్టే అందంగా సాగిన సన్నివేశాలు సూపర్ గా ఉండటంతో పాటు, చిత్ర విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ని 'జ్వాలమ్మ' నేపథ్యంలో, ఆమె ఆచారానికి సంబంధించిన వాటిపై పూర్తి ఫోకస్ చెయ్యాల్సింది. 'జ్వాలమ్మ' లా సుబ్బలక్ష్మి నటించాలని అనుకోని,నిజమైన జ్వాలమ్మ సుబ్బలక్ష్మి లోకి ప్రవేశించి అసలు రహస్యాన్ని చెప్పించి ఉంటే, పరదా విజయం తాలూకు స్వరూపం మారిపోయేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
సుబ్బలక్ష్మి క్యారక్టర్ లో అనుపమ పరమేశ్వరన్ పెర్ ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన ఎంటైర్ కెరీర్ లో ఇలాంటి పెర్ ఫార్మ్ చేసే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అనేలా చేసింది. పుట్టి పెరిగిన గ్రామాన్ని, ఆ గ్రామ ఆచారాల్ని, మనుషులపై ప్రేమని, నమ్మకాన్ని పెంచుకునే అమాయకత్వంతో కూడిన నటనతో పాటు,తన గురించి తాను తెలుసుకునే సన్నివేశాల్లో అద్భుతంగా చేసింది. ఇక అమిష్ట క్యారక్టర్ లో మలయాళ చిత్రసీమకి చెందిన అగ్రనటి 'దర్శనా రాజేంద్రన్'(Darshana Rajendran)తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆధునిక భావాలని అందిపుచ్చుకున్న యువతిగా,ఆమె స్క్రీన్ పై కనపడుతున్నంత సేపు చూస్తూనే ఉంటాం. సంగీత సినీ జర్నీలో రత్న క్యారక్టర్ మెమొరబుల్ గా నిలిచిపోతుంది. రాజేంద్ర ప్రసాద్(Rajendraprasad),హర్ష వర్ధన్, రాగ్ మయూర్, బలగం సుధాకర్ రెడ్డి మంచి నటనని కనపర్చారు. రచన, దర్శకత్వం పరంగా ప్రవీణ్ మంచి ప్రతిభనే కనపరిచాడు. ధర్మశాలలో తెరకెక్కించిన సన్నివేశాల్లో మాత్రం తన దర్శకత్వ ప్రతిభ ఎంతో మెరుగ్గా ఉంది. డైలాగ్స్ కూడా బాగుండటంతో పాటు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. కెమెరా, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
నిర్మాణ విలువలు కూడా హైలెట్.
ఫైనల్ గా చెప్పాలంటే 'పరదా' మంచి మెసేజ్ తో తెరకెక్కింది. నటీనటుల పెర్ ఫార్మెన్స్ , కథ, దర్శకత్వప్రతిభ, ధర్మశాల' అందాలు ఆకట్టుకునే స్థాయిలోనే ఉన్నాయి.
రేటింగ్ 2 .75 /5 అరుణాచలం
![]() |
![]() |