![]() |
![]() |

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ లెవెల్ లో సత్తా చాటిన దర్శకధీరుడు రాజమౌళి.. తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా రానున్న ఈ ఫిల్మ్.. అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదలైన ప్రీ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ లో గ్లింప్స్ విడుదల కానుంది. అయితే ఈ గ్లింప్స్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా విడుదల కానుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.
'టైటానిక్', 'అవతార్' వంటి అద్భుతాలను సృష్టించిన జేమ్స్ కామెరూన్ వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి దిగ్గజ దర్శకుడు సైతం.. రాజమౌళి ప్రతిభకు ఫిదా అయ్యారు. కామెరూన్ పలు సందర్భాల్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని, దర్శకుడు రాజమౌళిని ప్రశంసించారు. ఆస్కార్ అవార్డ్స్ వేడుక సమయంలో ప్రత్యక్షంగా కలిసి మరీ జక్కన్నను అభినందించారు. ఈ క్రమంలో జేమ్స్ కామెరూన్ కి, రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే 'SSMB 29' గ్లింప్స్ విడుదల చేయడానికి జేమ్స్ కామెరూన్ ఓకే చెప్పినట్లు సమాచారం.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన నవంబర్ లో ఇండియాకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆయన 'SSMB 29' గ్లింప్స్ విడుదల చేయనున్నారని వినికిడి.
నిజానికి గతేడాదే 'SSMB 29' లాంచ్ కి జేమ్స్ కామెరూన్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. లాంచ్ చేయకుండానే డైరెక్ట్ గా షూట్ స్టార్ట్ చేశారు రాజమౌళి. ఇక ఇప్పుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా గ్లింప్స్ విడుదల కానుందని న్యూస్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే 'SSMB 29'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గ్లింప్స్ ను జేమ్స్ కామెరూన్ లాంచ్ చేస్తే.. ఈ సినిమా గురించి ఇంటర్నేషనల్ మీడియాలో మారుమోగిపోతుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |