![]() |
![]() |

'దుబాయ్ శీను' సినిమాలో హోటల్ సీన్ లో "ఏం తీసుకుంటారు" అని వేణుమాధవ్ అడగ్గానే.. "మూడు ఊతప్ప, ఒక రవ్వ దోస, రెండు ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ" అంటూ కమెడియన్ రామచంద్ర చెప్పిన తీరు భలే ఉంటుంది. ఈ సీన్ ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంది. అంతలా నవ్వించిన రామచంద్ర.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమై, సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా లాంచ్ అయిన 'నిన్ను చూడాలని' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రామచంద్ర. ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శీను, లౌక్యం వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాలు రామచంద్రకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన రామచంద్ర.. గత పదేళ్లుగా పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఒకటి అరా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన.. ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.
రీసెంట్ గా రామచంద్ర ఓ డెమో షూట్ లో పాల్గొనగా.. సడెన్ గా కాలు, చేయి నొప్పి రావడంతో మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేశారట. అనంతరం డాక్టర్ ని సంప్రదించగా.. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిసింది. ఆ క్లాట్ వల్ల పెరలాసిస్ ఎటాక్ కాగా.. ఎడమ చేయి, ఎడమ కాలు పడిపోయాయి. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం రామచంద్ర విశ్రాంతి తీసుకుంటూ.. ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నారు.
తన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు రామచంద్ర. ఇప్పటికే ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చయిందని.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ కావడంతో కొంత కవర్ అయిందని తెలిపారు. అయితే ట్రీట్మెంట్ కోసం మరిన్ని డబ్బులు అవసరమని.. ఇప్పటికే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయని పేర్కొన్నారు. ఎవరైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఇప్పటివరకైతే సినీ పరిశ్రమ నుంచి తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆరా తీయలేదని రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రామచంద్ర పలువురు స్టార్ల సినిమాల్లో నటించారు. మరి ఎవరైనా స్టార్ ముందుకొచ్చి.. ఆయన ట్రీట్మెంట్ కి కావాల్సిన ఆర్ధిక సాయం అందిస్తారేమో చూడాలి.
![]() |
![]() |