![]() |
![]() |

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎంతో మంది నటీమణులు తమ అందంతో నటనతో ప్రేక్షకులని అలరిస్తు వచ్చారు. కొంత మంది నటీమణులు అయితే పరిశ్రమ నుంచి వెళ్లిపోయి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ప్రేక్షకుల గుండెల్లో పదిలంగానే ఉంటారు. అలాంటి నటీమణుల్లో ఒకరు నగ్మా. 90 వ దశకంలో నగ్మా అనే పేరు వినపడితే చాలు కుర్రకారు గుండెల్లో ఒక రకమైన వైబ్రేషన్ మొదలయ్యేది. అసలు ఆ రోజుల్లో నగ్మా బొమ్మ లేని కాలేజీ కుర్ర కారు రూమ్ కూడా ఉండేది కాదు. అభిమానుల గుండెల్లో అరేబియన్ గుర్రం, అందాల రాక్షసి అనే బిరుదులని పొందిన నగ్మా పుట్టిన రోజు ఈ రోజు. నేటితో ఆమె 48 సంవత్సరాలని పూర్తి చేసుకొని 49 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది
నగ్మా సినీ రంగ ప్రవేశం 1990 లో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన భాగీ అనే సినిమాతో జరిగింది. తొలి చిత్రమే అయిన సల్మాన్ కి జోడిగా సూపర్ గా నటించింది. ఆ తర్వాత సుమన్ హీరోగా 1991 లో వచ్చిన పెద్దింటి అల్లుడు చిత్రంతో నగ్మా తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమా విజయంతో లక్కీ హీరోయిన్ గా గుర్తింపుని పొందిన నగ్మా ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో ఒక పెను సంచలనమే సృష్టించింది. నాగార్జున కి జతగా కిల్లర్ సినిమాలో తన అందానికి తగ్గట్టు నటించి ఓవర్ నైట్ యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. అంతే కాకుండా ఆ మూవీలోని ప్రియా ప్రియతమ రాగాలు అనే పాటలో సూపర్ గా తన భావాలని పండించి నేటికీ ఆ పాట ప్రేక్షకుల మైండ్ లో నుంచి పోకుండా చేసింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమాతో నగ్మా ఒక్కసారిగా టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఆ సినిమాలో కోటీశ్వరాలనే అహంకారాన్ని అణువణువున నింపుకొని తను అనుకున్న దాని కోసం సొంత భర్తనే కష్టాలు పెట్టి ఆ తర్వాత భర్తని ప్రేమించే ఉమాదేవి పాత్రలో నగ్మా నటనకి జేజేలు కొట్టని ప్రేక్షకుడు ఉండడు. ఆ తర్వాత నాగార్జునతో వరుసగా వారసుడు, అల్లరి అల్లుడు లాంటి సినిమాలు చేసి నాగార్జున కెరీర్ లోనే ఆ సినిమాలు సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలబడేలా చెయ్యటంలో నగ్మా కూడా ఒక కారణమని నిస్సందేహంగా ఒప్పుకోవచ్చు.

ఆ తర్వాత మోహన్ బాబు సరసన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించి ఆ సినిమాలోని పాటల్లో నగ్మా ప్రదర్శించిన అభినయాన్ని నేటికీ మర్చిపోని వారు లేరు.అలాగే ఆ సినిమా టైటిల్ రోల్ లో నటించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా ఆమె పొందింది. అశ్వమేధం, కొండపల్లి రాజా,సరదా బుల్లోడు, సూపర్ పోలీస్,ముగ్గురు మొనగాళ్లు, గ్యాంగ్ మాస్టర్ ,ఆవేశం ,రిక్షావోడు లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కి అత్తగా అడవిరాముడు మూవీలో మెరిసిన నగ్మా తెలుగులో మొత్తం 20 సినిమాలకి పైగానే చేసింది. హిందీలో 17 సినిమాలు, తమిళంలో 12 ,కన్నడ,మలయాళం కలిపి 5 సినిమాల్లో చేసింది. అలాగే ఇంతవరకు ఏ ఇండియన్ నటీమణికి సాధ్యం కానీ రీతిలో భోజ్ పురి భాషలో 11 సినిమాల్లో నటించింది. బెంగాలీ, పంజాబీ లో కూడా నటించిన నగ్మా చైనీస్ భాషలో కూడా ఒక సినిమాలో నటించడం విశేషం. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా పని చేస్తు కాంగ్రెస్ పార్టీ కి తన వంతు సాయం చేస్తుంది.
![]() |
![]() |