![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కు మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈనెల 22న జరగనున్న మైసూరు యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారు.
నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న కన్నడ స్టార్ పునీత్ గతేడాది అక్టోబర్ లో గుండెపోటుతో 46 ఏళ్లకే కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంచి నటుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగానూ ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించిన పునీత్ కు మరణానంతరం మైసూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఈ మేరకు మైసూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హేమంత్‌కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పునీత్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసే విషయమై వారి కుటుంబీకులతో చర్చించామన్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు పునీత్ భార్య అశ్విని అంగీకరించారని తెలిపారు.
పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కు మైసూరు యూనివర్సిటీ 1976 ఫిబ్రవరిలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈనెల 22న జరగనున్న మైసూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పునీత్‌తో పాటు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వీఎస్ ఆత్ర, జానపద కళాకారుడు మళవళ్లి మహదేవస్వామికి కూడా గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నారు.
ఇదిలాఉంటే పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ఆయన జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కానుంది. పునీత్ గౌరవార్థం కర్ణాటకలోని థియేటర్స్ లో వారం రోజుల పాటు (మార్చి 17 నుంచి మార్చి 24 వరకు) వేరే సినిమాలను ప్రదర్శించకూడదని నిర్ణయించారు.
![]() |
![]() |