![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లోని నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో `ఊసరవెల్లి` ఒకటి. `అశోక్` (2006) తరువాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తారక్ నటించిన ఈ సినిమాలో.. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించింది. డబ్బు కోసం ఏమైనా చేసే టోనీ (ఎన్టీఆర్) జీవితంలోకి నిహారిక (తమన్నా) అనే అమ్మాయి వచ్చాక ఏమైంది? నిహారిక ప్రేమ కోసం టోని ఏం చేశాడు? అసలు నిహారిక గతమేంటి? అనే అంశాల చుట్టూ తిరిగే ఈ రివెంజ్ డ్రామాని సూరి తెరకెక్కించిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్ని ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``నిహారిక నిహారిక`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``బ్రతకాలి``, ``నేనంటే నాకు``, ``లవ్ అంటే కేరింగ్``, ``దాండియా ఇండియా`` గీతాలు కూడా ఆకట్టుకున్నాయి. పాయల్ హోష్, ప్రకాశ్ రాజ్, శ్యామ్, విద్యుత్ జమ్వాల్, భరణి, జయప్రకాశ్ రెడ్డి, రహ్మాన్, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, రఘు కారుమంచి, షాయాజీ షిండే ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా బెంగాలీలో `రాకీ`(2013) పేరుతో రీమేక్ అయింది. 2011 అక్టోబర్ 6న విజయదశమి కానుకగా విడుదలైన `ఊసరవెల్లి`.. నేటితో 10 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |