![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తూ.. గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 'మా' ఎన్నికల్లో కుట్ర జరుగుతోంది అంటూ ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. మంచు విష్ణు ప్యానల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మిస్ యూజ్ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
తాజాగా తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాష్ రాజ్.. విష్ణు టీమ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 50 కి పైగా ప్యానల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను విష్ణు టీమ్ తమకు అనుకూలంగా వేసుకుందని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 60 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే.. అందులో 56 మందికి ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఒకేసారి రూ.28,000 మోహన్ బాబు కంపెనీకి చెందిన మేనేజర్ కట్టారని చెబుతూ రసీదును మీడియాకు చూపించారు ప్రకాష్ రాజ్. 'మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు గారు.. మీ 500 రూపాయలు కూడా కట్టారు సార్ వీళ్ళు' అంటూ ప్రకాష్ రాజ్ కంటతడి పెట్టుకున్నారు. "మహేష్ బాబు తండ్రి ఘట్టమనేని కృష్ణ గారి డబ్బు కట్టారు.. పరుచూరి బ్రదర్స్ డబ్బు కూడా వీళ్ళే కట్టారు. ఇలా జరుపుతారా ఎలక్షన్స్? ఇలా గెలుస్తారా మా మీద?" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఈ విషయమై శరత్ బాబు కి కాల్ చేసి అడిగితే.. 'వాళ్ళు కట్టి ఉంటారు, మోహన్ బాబుకి గూగుల్ పే చేస్తాను' అన్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. లెటర్ రాయాల్సింది మీరు.. డబ్బులు కట్టాల్సింది 'మా' అసోసియేషన్ కి.. మరి మోహన్ బాబు గారికి కట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. "అసలు ఎన్నికలు జరిగే విధానం ఇదేనా?.. దీనికి సినీ పెద్దలు సమాధానం చెప్పాలం"టూ ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |